కలెక్టర్ పేరుతో వాట్సప్ ఛాటింగ్.. అమేజాన్ గిఫ్ట్ కూపన్ పంపమని.. బురిడీ కొట్టించే ప్రయత్నం

Komaram Bheem Asifabad: సిక్తా పట్నాయక్ పేరుతో జరిగినట్లే.. రాహుల్ రాజ్ పేరుతో ప్రయత్నం...

Update: 2022-04-23 04:39 GMT

కలెక్టర్ పేరుతో వాట్సప్ ఛాటింగ్.. అమేజాన్ గిఫ్ట్ కూపన్ పంపమని.. బురిడీ కొట్టించే ప్రయత్నం

Komaram Bheem Asifabad: సులభంగా సంపాదించేందుకు సైబర్ నేరగాళ్లు(Cyber Fraud) కొత్తమార్గాలు ఎంచుకుంటున్నారు. నిన్న మొన్నటిదాకా ఫేస్ బుక్‌లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బులు పంపమని మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు తాజాగా వాట్సప్‌(WhatsApp) ను వినియోగిస్తున్నారు. నిన్న ఆదిలాబాద్ కలెక్టర్ ఫోటోను ప్రొఫైల్ డిస్‌ప్లే పిక్చర్ గా వాడిన కేటుగాళ్లు... కొమురం భీం జిల్లా కలెక్టర్ ఫొటోతో బురిడీ కొట్టించాలని ప్రయత్నించారు.

కుమురం భీం ఆసిఫాబాద్(Komuram Bheem Asifabad) జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(Rahul Raj) పేరుతో వాట్సాప్ సామాజిక వేదికగా జిల్లా అధికారులందరికీ సందేశాలు వచ్చాయి. 'నేను అత్యవసర సమావేశంలో ఉన్నాను. మాట్లాడటానికి వీలుకాదు. డబ్బులు పంపమని' జిల్లాలోని అధికారులందరికీ 9725199485 నెంబరు నుంచి మెసెజ్ లు పంపారు. కలెక్టర్ ఫొటో డిసిప్లే పిక్చర్ ఉండటంతో పలువురు అధికారులు నిజమేనని నమ్మి బదులు ఇచ్చారు. జిల్లా పంచాయతి అధికారి రవికృష్ణకు ఎక్కడున్నారని ఛాట్ చేసి పలుకరించారు... కలెక్టర్ అత్యవసర సమావేశంలో ఉన్నట్లు నమ్మించి అమేజాన్ ఈ పే గిఫ్ట్ కార్డులు(Amazon Gift Cards) పంపమని సూచించారు.

ఆదిలాబాద్(Adilabad) కలెక్టర్ సిక్తాపట్నాయక్(Sikta Patnaik) డీపీతో ఇదే విధంగా సందేశాలు వచ్చిన నేపథ్యంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అధికారులు మొదట సందేశాలకు బదులు ఇచ్చినా ఆ తర్వాత అప్రమత్తమయ్యారు. ఎవరూ డబ్బులు పంపలేదు. బ్యాంకు, ఏటీఎమ్ నంబర్లు సైతం చెప్పలేదు. ఈ విషయం పై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పందిస్తూ.. మోసపూరిత సందేశాలకు ఎవరూ స్పందించవద్దని జిల్లా అధికారులకు, ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News