Customer Service Points Cheating Tribes : గిరిజనులను దోచేస్తున్న కస్టమర్ సర్వీస్ పాయింట్లు..
Customer Service Points Cheating Tribes : గిరిజనుల అమాయకత్వాన్ని ఆదాయంగా మార్చుకున్నారు కస్టమర్ సర్వీస్ పాయింట్ల ఓనర్లు. మినీ ఏటీఎం, మైక్రో ఏటీఎం కేంద్రాలుగా దర్జాగా దందా చేస్తున్నారు. గిరిజనులు డబ్బులు డ్రా చేసేందుకు వెళ్తే ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు. పైగా కమిషన్లు అంటూ వాతలు పెడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కస్టమర్ సర్వీస్ పాయింట్ల దందాపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కస్టమర్ సర్వీస్ పాయింట్లు గిరిజనలు కష్టార్జితాన్ని మింగేసే కేంద్రాలుగా మారాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సర్వీసులు అంతంత మాత్రమే. పింఛన్, రైతుబంధు, ఉపాధిహామీ వంటి డబ్బులు గిరిజనుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. కానీ వాటిని డ్రా చేయాలంటే 30 కిలోమీటర్లు ప్రయాణించాలి. పైగా బ్యాంకుల్లో చాంతడంతా లైన్ ఉంటుంది. ఈ సమస్యలను క్యాష్ చేసుకున్నాయి ప్రైవేట్ కస్టమర్స్ సర్వీస్ పాయింట్ల నిర్వాహకులు. బ్యాంకులకు వెళ్లకుండానే క్షణాల్లో డబ్బులు డ్రా చేసి ఇస్తామంటూ సర్వీస్ పాయింట్లను నెలకొల్పారు.
ఇదంతా బాగానే ఉందిగానీ కొందరు నిర్వాహకులు మాత్రం అమాయక గిరుజనులను సులభంగా మోసం చేస్తున్నారు. వెయ్యి రూపాయాలు డ్రా చేయమని వెళ్తే రెండు వేలు డ్రా చేస్తున్నారు. ఖాతాదారుడికి మాత్రం వెయ్యి రూపాయాలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. గిరిజనులు చెప్పిన అమౌంట్ కంటే ఎక్కువ డ్రా చేసి తక్కువ ఇస్తున్నారు.
ఈ దందా అంతా ఒకరూ ఇద్దరు చేస్తున్న తతంగం కాదు. ఉట్నూర్, ఇంద్రవేల్లి, కెరిమెరి, సిర్పూర్, కౌటలా, తిర్యాని, నార్నూర్, జైనూర్, లింగపూర్, సిర్పూర్ మండలాల్లో ఉన్న అన్ని కస్టమర్ సర్వీస్ పాయింట్లలో ఇదే దందా జరుగుతోంది. గిరిజనులకు చెందిన లక్షల రూపాయాలను దోచేస్తున్నారు. ఓ వైపు మొత్తానికంటే అధికంగా డ్రా చేస్తుంటే మరికొందరు మాత్రం పదివేల రూపాయాలు డ్రా చేస్తే వెయ్యి నుంచి 15 వందల వరకు కమిషన్ తీసుకుంటున్నారు. ఈ వ్యవహరంపై గిరిజనులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అమాయక గిరిజనులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.