Telangana Rains: రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వానలు
Telangana Rains: వచ్చే ఐదు రోజుల్లో వర్షాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలన్నారు.
Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తోన్న వర్షాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్టంలో మరో 5రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొంగులేటి, సీఎస్ శాంతి కుమారి.. అధికారులతో రివ్యూ నిర్వహించారు. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, వరదల వల్ల జన జీవనానికి ఎలాంటి ఇబ్బంది, ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి పలు సూచనలు చేశారు.
వచ్చే ఐదు రోజుల్లో వర్షాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలన్నారు. గత రాత్రి గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినా వీలైనంత మేరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీస్కోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు సీఎస్ శాంతికుమారి.