ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో పోలీసులకు కావాల్సిన వనరులను సమకూరుస్తోంది. నేరాలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీంతో తమ భద్రతకు ఢోకా లేదనుకున్నారు ప్రజలు. కానీ కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలు గ్రేటర్‌వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుశాపూర్ రైల్వే గేట్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. మహిళను చంపి ముఖం గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగుల బెట్టారు. మహిళను గుర్తించినా ఇప్పటి వరకు కేసులో పెద్దగా పురోగతి లేదు. ఇక జనవరి 3 న మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. జనవరి 4న కూకట్ పల్లిలో పూల వ్యాపారి కృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. జనవరి 9న బల్కంపేటలో తల్లిని తనయుడే దారుణంగా హతమార్చాడు. ఇక తమ సోదరిని వేధిస్తున్నాడనే కారణంతో ఇద్దరు యువకులు రియాజ్ అనే ఆటోడ్రైవర్ ను చంపి శవాన్ని సూట్ కేసులో కుక్కి రాజేంద్రనగర్ డైరీ ఫాం వద్ద పడేశారు. ఇక తానిచ్చిన అప్పు తీర్చమని ఒత్తడి చేసినందుకు ముగ్గురు వ్యక్తులు మెహదీపట్నం నుంచి ఆరంఘర్ వైపు వెళ్లే రహదారిపై వెంటాడి వేటాడి కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా కొట్టి చంపారు.
ఇక సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో నిందితులు బాధితులను చాలా ఈజీగా కిడ్నాప్ చేశారు. బాధితులను వాహనాల్లోనే ఉంచి ఔటర్ తో పాటు సిటీలో రోడ్లపై దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రయాణించినా పోలీసులు కనిపెట్టలేకపోయారు. అలాగే, డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి భూవివాదంలో సెటిల్మెంట్ కు రావటం లేదని తుపాకీ చూపి బెదిరించాడు. గాల్లోకి కాల్పులు జరిపాడు. నిందితుడి వద్ద దాదాపు ఆరు సంవత్సరాలుగా తుపాకి బుల్లెట్లు ఉన్నాయని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఏదేమైనా వరుస నేరాలు సిటీ జనాలను టెన్షన్ కు గురిచేస్తున్నాయి. ఇప్పటికైనా భద్రతాపరమైన లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.