Covid Vaccine: రేపటి నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్.. రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

Covid Vaccine: ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో వ్యాక్సిన్‌ డోసు రూ.1410...

Update: 2022-01-02 03:45 GMT

Covid Vaccine: రేపటి నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్.. రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

Covid Vaccine: పిల్లలకు కొవిడ్‌ టీకా రేపటి నుంచి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. మరోవైపు వ్యాక్సినేషన్‌ కోసం 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల వివరాలను కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకునే సేవలు కూడా ప్రారంభమయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు 12 మునిసిపల్‌ కార్పొరేషన్లలో కొవిన్‌ పోర్టల్‌ ద్వారా టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పిల్లలకు రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని, నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ పీహెచ్‌సీలకు తీసుకెళ్లి టీకా వేయించవచ్చని పేర్కొంది. గుర్తింపు కోసం వారి ఆధార్‌ కార్డులను తీసుకెళ్లాల్సి ఉంటుంది. పిల్లలకు భారత్‌ బయోటెక్‌ కంపెనీకి చెందిన కొవ్యాక్సిన్‌ టీకాను మాత్రమే అందిస్తారు. వైద్యుల పర్యవేక్షణలో టీకా తీసుకున్నాక.. 30 నిమిషాల పాటు టీకా కేంద్రంలోనే ఉండాలి.

వారిలో ఎటువంటి దుష్పరిణామాలు లేవని గమనించాకే అక్కడి నుంచి వైద్యులు పంపుతారు. 28 రోజుల తర్వాత విధిగా టీకా రెండో డోసు తీసుకోవాలి. 2007 లేదా అంతకుముందు పుట్టిన పిల్లలే టీకాకు అర్హులని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో 15-18 ఏళ్లవారు 22.78 లక్షల మంది ఉన్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ఒక్కో స్లాట్స్‌లో 250 మందికి, వరంగల్‌లోని ప్రభుత్వ టీకా కేంద్రాల్లో 50 స్లాట్స్‌నే కేటాయించారు.

తొలిరోజు గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్‌ పట్టణాలు మినహాయిస్తే కొవిన్‌ పోర్టల్‌లో మిగిలిన ప్రధాన పట్టణాల్లో వ్యాక్సిన్‌ కేంద్రాల జాబితా కనిపించలేదు. అయితే ఒకటి రెండు రోజుల్లో మిగిలిన పట్టణాల్లో కూడా అందుబాటులోకి తెస్తామని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News