Covid-19 Effect: మాస్కు ధరించని 67వేల మందిపై కేసు నమోదు
Covid-19 Effect: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజూకీ కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతోంది.
Covid-19 Effect: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజూకీ కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో తిరిగే ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలని స్పష్టం చేసింది.
అయితే, ఈ నిబంధన ఉల్లంఘించి మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగినందుకు తెలంగాణ వ్యాప్తంగా 67,557 మందిపై పోలీసులు ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు. మరో 3288 మందికి ఈ-చలానాలు సైతం జారీ చేశారు. లాక్‌డౌన్ విధించిన అమలులోకి వచ్చిన మార్చి 22 నుంచి జూన్ 30వ తేదీ వరకు 29 పోలీసు యూనిట్ల పరిధిలో ఈ కేసులను నమోదు చేశారు.
హైదరాబాద్‌లో అత్యధికంగా 14,931 మందిపై కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో రామగుండం కమిషనరేట్(8,290), ఖమ్మం(6,372), సూర్యాపేట(4,213), వరంగల్(3,907) ఉన్నాయి. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 173 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. జులై నెల తొలిరోజే 1018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ వెయ్యికిపైగా కేసులు నమోదవడం ఇది రెండోసారి. మొత్తం బాధితుల సంఖ్య 17,357కు పెరిగింది. బుధవారం కరోనా బారినపడి మరో ఏడుగురు మరణించారు.