లంచగొండి అధికారులపై ఏసీబీ దాడులు జరిపినా భయం లేకుండా పోతుందా?

Update: 2021-01-30 09:42 GMT

లంచగొండి అధికారులపై ఏసీబీ దాడులు జరిపినా భయం లేకుండా పోతుందా?

ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి రోజురోజుకి మితిమీరిపోతోంది. కాసులు సమర్పించనిదే ఏ పని కావడం లేదు. లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు చేతికి చిక్కుతున్నప్పటికీ అవినీతి పరుల్లో భయం లేకుండా పోతోంది. ఇటీవల ఏసిబి నిర్వహించిన వరస దాడుల్లో జరిగిన సంఘటనలే ఇందుకు అద్దం పడుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లాలో ఏసిబి అధికారులు వరస దాడులతో హడలెత్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలో రెండు నెలల వ్యవధిలో మూడుసార్లు నిర్వహించిన దాడులలో ఐదుగురు అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయినప్పటికీ అధికారుల తీరులో ఏ మాత్రమ మార్పు రావడం లేదు. కొంతమంది ఎక్కడో ఒకచోట అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల జిల్లాలో అవినీతి వ్యతిరేక వారోత్సవాలను జరుపుకున్న ఏసిబి అధికారులు జిల్లాలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న కొంతమంది అవినీతి అధికారుల లిస్టులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా గత డిసెంబర్ 4 న జిల్లా సిపివో కార్యాలయంలో ఉప గణాంక అధికారిగా పనిచేస్తున్న ప్రదీప్‌ను ఓ కాంట్రాక్టర్ నుంచి 5 వేలు లంచం తీసుకోబోతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసిబి అధికారులు. అయితే అదే నెలలో 28న విద్యుత్ శాఖలో పనిచేసే ముగ్గురు అధికారులు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకునే క్రమంలో వలపన్ని పట్టుకున్నారు. ఈ రెండు ఘటనలు ఇంకా మరవక ముందే తాజాగా ఆదిలాబాద్ రూరల్ మండలంలో పంచాయతీరాజ్ AE గా పనిచేస్తున్న చంద్రశేఖర్ సిసి రోడ్లకు సంబందించిన బిల్లులు చెల్లించడం కోసం సునీల్ అనే కాంట్రాక్టర్ నుండి రూ 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారుల చేతికి చిక్కాడు. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుస్తూనే ఉంది.

ఒక్కప్పుడు గుట్టు చప్పుడు కాకుండా చేయి తడిపితేనే బిల్లులు మంజూరయ్యేవని అందరికి తెలిసిన విషయమే, కానీ ప్రస్తుతం కొందరు అధికారులు రూటుమార్చి అవినీతికి ఎగబడుతున్నారు. ఎందుకంటే ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో లంచం తీసుకునేందుకు ఇబ్బందికరం గా మారింది. దీంతో రోడ్లు, హోటల్స్‌లలో డీల్‌ చేసుకుంటూ అందినకాడికి జేబులో వేసుకుంటున్నారు. ఇటీవల ఏసీబీకి పట్టుబడిన పంచాయతీరాజ్‌ ఏఈ చంద్రశేఖర్‌ నిత్యం రద్దీగా ఉండే రెవెన్యూ గార్డెన్‌ ముందే ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

జిల్లాలో ఇలా ఏసిబి అధికారులు వరస దాడులు నిర్వహిస్తూ అవినీతి చేపలను పట్టుకుంటున్నా ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కొంతమంది అవినీతి పరుల వైఖరిలో మార్పు రావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలలో పలు శాఖల్లో పనిచేస్తున్న కొంతమంది అవినీతి పరుల తీరుతో మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

Tags:    

Similar News