Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(బుధవారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,724 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 97, 424కి చేరింది. మృతుల సంఖ్య 729కి పెరిగింది. గడచిన 24 గంటలలో రాష్ట్రంలో 1,195 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 75,186కి చేరింది. ప్రస్తుతం 21,509 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన 1,724 పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 395 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 105, రంగారెడ్డిలో 169 కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 24వేలకుపైగా పరీక్షలు చేయగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,97,470 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.