Coronavirus Effect: కరోనా పేరుతో రోగులకు వాత.. ఏ చికిత్స వెళ్లినా టెస్టు తప్పనిసరి

Coronavirus Effect: గతంలో హెచ్ఐవీ అధికంగా కేసులు నమోదయ్యే సమయంలో ఆస్పత్రికి ఏ వ్యాధి శస్త్ర చికిత్స కోసం వెళ్లినా టెస్టు తప్పనిసరి చేసేవారు.

Update: 2020-08-25 04:20 GMT

Coronavirus Effect: గతంలో హెచ్ఐవీ అధికంగా కేసులు నమోదయ్యే సమయంలో ఆస్పత్రికి ఏ వ్యాధి శస్త్ర చికిత్స కోసం వెళ్లినా టెస్టు తప్పనిసరి చేసేవారు. అయితే దాన్ని ఇప్పుడూ కొనసాగిస్తున్నారు. అది అంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. ప్రస్తుత తరుణంలో ఆస్పత్రికి ఈ వ్యాధి కోసం వెళ్లినా పాజిటివ్ టెస్ట్ తప్పనిసరి చేస్తున్నారు... ప్రభుత్వ ఆస్పత్రులన్నీ కోవిద్ కేసులతో నిండి ఉండటంతో అధికశాతం మంది రోగులు ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. వీటి యాజమాన్యాలు టెస్ట్ చేయడం ఒక వంతయితే, దాని రిజల్ట్ వచ్చే వరకు ఆస్పత్రి వసూలు చేసే చార్జీలు మరింత మోత అవుతోంది.

శస్త్రచికిత్సల కోసం ప్రస్తుతం కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్తే కరోనా చార్జీల షాక్‌ కొడుతోంది. పరిస్థితుల కారణంగా ఏదో ఒక రూపంలో రోగులపై అదనంగా ఆర్థిక భారం పడుతోంది. ఈ భారం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటోంది. గుండె, పక్షవాతం, కిడ్నీ, కాలేయం ఇలా ఏ అవయవానికి సంబంధించిన జబ్బుతో వచ్చినా తొలుత ఐసోలేషన్‌కు తరలించి సీటీ స్కాన్‌, సీబీపీ పరీక్షలు చేస్తున్నారు. ఫలితం నెగెటివ్‌ వచ్చాకే సంబంధిత వార్డుకు తరలించి ఆపరేషన్‌ ప్రక్రియ చేపడుతున్నారు. కరోనా పరీక్ష సహా సీటీ స్కాన్‌, పీపీఈ కిట్లకు అయిన మొత్తాన్ని ఆపరేషన్‌ చార్జీల్లో కలిపి బిల్లు ఇస్తున్నారు.

ఇదేంటని రోగుల బంధువులు అడిగితే.. 'మేమేమీ ఎక్కువ వసూలు చేయడం లేదు. అంతా పాత ధరలే' అని ఆస్పత్రుల వారు చెబుతున్నారు. కొందరికి అత్యవసర పరిస్థితుల్లో అవయవాల మార్పిడి చేయాల్సి వస్తోంది. కరోనా సమయంలో సాధారణ ఆపరేషన్లే కష్టమని.. అలాంటిది అవయవ మార్పిడి అంటే సాహసమేనని చెబుతూ అదనపు చార్జీలు వేస్తున్నారు. గతంలో కాలేయ, ఊపిరితిత్తుల మార్పిడికి రూ.25 లక్షల వరకు అయ్యేది. ఇప్పుడు రూ.30 లక్షలు అవుతోంది. కాలేయ మార్పిడి తర్వాత రోగికి ఇన్ఫెక్షన్‌ సోకకుండా ఉండాలంటే ముందునుంచే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని, అందుకే ఎక్కువవుతోందని అంటున్నారు.

ప్రసవానికి వెళ్తే..

నర్సింగ్‌ హోంల నుంచి కార్పొరేట్‌ ఆస్పత్రుల వరకు ప్రసవాల చార్జీలను పెంచేశారు. హైదరాబాద్‌లో సాధారణ ప్రజలు వెళ్లే గాంధీ, కింగ్‌ కోఠి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పూర్తిగా నిలిపివేశారు. కేసులను సుల్తాన్‌బజార్‌, నిలోఫర్‌, పెట్లబురుజు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అయితే, రద్దీ ఎక్కువవుతుండటంతో కొందరు ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలను ఆశ్రయిస్తున్నారు. దీంతో కొన్ని ఆస్పత్రులు ప్రసవ చార్జీలను పెంచేశాయి. రూ.30 వేల నుంచి రూ.50 వేలు అదనంగా తీసుకుంటున్నాయి. కొన్ని భారీ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్‌కు రూ.లక్షన్నర వరకు కూడా అవుతోంది. సాధారణ ప్రసవాలకూ రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఎక్కువ తీసుకుంటున్నారు.

శస్త్రచికిత్స అవసరమైనా..

నల్లగొండకు చెందిన ఓ వ్యక్తి బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యాడు.హైదరాబాద్‌ తీసుకొచ్చి కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. కరోనా లక్షణాలు లేకున్నా.. ముందుజాగ్రత్తగా ఐసోలేషన్‌ గదికి తరలించారు. నమూనాలు తీసి పరీక్షకు పంపారు. ఫలితం రావడానికి 24 గంటలు పట్టింది. ఈ క్రమంలో ఐసోలేషన్‌ గదికి రూ.50 వేలు, కొవిడ్‌ పరీక్షల చార్జీ రూ.10 వేలు అయింది. ఇతర చార్జీలూ కలుపుకొంటే రూ.70 వేలు దాటాయి.

శస్త్రచికిత్స లేకున్నా..

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తి తీవ్ర జ్వరంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాడు. కరోనా నెగెటివ్‌ వచ్చింది. అయితే, నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడికి రూ.4 లక్షల బిల్లు వేశారు. ఇందులో పీపీఈ కిట్లకు రూ.40 వేలు, ఐసోలేషన్‌కు రూ.65 వేల వరకు అయింది. ఆక్సిజన్‌కు రూ.30 వేలయింది

Tags:    

Similar News