Telangana: కరోనా టెన్షన్.. వ్యాక్సిన్ సెంటర్ల వద్ద బారులు తీరిన జనం
Telangana: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
Telangana: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ కొంతకాలంగా తెలంగాణలో వ్యాక్సిన్ కొరత విపరీతంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో 45ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గతవారంలో వ్యాక్సిన్ కొరతతో మూడు రోజులుగా వ్యాక్సినేషన్ నిలిపేసిన వైద్య ఆరోగ్యశాఖ టీకాలు రావడంతో మళ్లీ తిరిగి పున:ప్రారంభించింది. అయితే ప్రతీరోజు వ్యాక్సిన్ కేంద్రాలకు వంద టీకాలు మాత్రమే సప్లై అవుతున్నట్లు వ్యాక్సిన్ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఇక టీకాలు అందుబాటులోకి వచ్చాయని తెలియడంతో వ్యాక్సిన్ సెంటర్లకు జనాలు క్యూ కట్టారు. అయితే వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర సరిపడ టీకాలు లేకపోవడంతో సెకండ్ డోస్ వేసుకునే వారు తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ కోసం వేచిచూస్తున్నామంటున్న ప్రజలు, మళ్లీ అధికారులు తమను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఒకవైపు వ్యాక్సిన్ కోసం జనం క్యూ కడుతుంటే మరోవైపు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు వ్యాక్సిన్ సెంటర్ కోసం వెతుకుతూ తిప్పలు పడుతున్నారు. ఇక వ్యాక్సిన్ కోసం కిలోమీటర్ల దూరం రావడానికి సిద్ధంగా ఉన్నా టీకాలు లేకపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం టీకాల సంఖ్య పెంచాలని కోరుతున్నారు.
ఇక తెలంగాణలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. మరోవైపు ప్రజలు వ్యాక్సిన్‌పై అపోహాలు, అనుమానాలు పొగొట్టుకున్నా టీకాల కొరత వేధిస్తోంది. ఇక ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలకు సరిపడే టీకాలు సప్లై చేయాలని కోరుకుందాం.