Coronavirus: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో కరోనా విజృంభణ

Coronavirus: మహారాష్ట్రలో కొద్దిరోజులుగా భారీగా కరోనా కేసులు

Update: 2021-03-27 03:41 GMT

కరోనా వైరస్(ఫైల్ ఫోటో)

Coronavirus: తెలంగాణ సరిహద్దులకు మహారాష్ట్ర ఫీవర్ పట్టుకుంది. మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా సరిహద్దు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆ రాష్ట్రం నుంచి రాకపోకలు అధికంగా ఉండే నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఈ జిల్లాలకు మహారాష్ట్ర నుంచి బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ప్రైవేటు వాహనాలు, రైళ్ల రాకపోకలు కొనసాగుతుండటంతో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.

మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో రాకపోకలు సహజం. అయితే కొద్దిరోజులుగా మహారాష్ట్రలో కొవిడ్ కల్లోలం కొనసాగుతోంది. సరిహద్దు జిల్లాల్లో కరోనా విస్తరణ తీవ్రంగా ఉంది. నాందేడ్‌, యావత్‌మాల్‌, చంద్రాపూర్‌, గచ్చిరోలి నుంచి అక్కడి ప్రజలు నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలకు నిత్యం వచ్చి వెళ్తుంటారు. నాందేడ్‌ హైదరాబాద్‌కు కూడా భారీ సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ముంబై నుంచి రైళ్లు కూడా నిజామాబాద్‌ మీదుగానే హైదరాబాద్‌కు నడుస్తున్నాయి. దీంతో కొవిడ్ ప్రభావం తెలంగాణ సరిహద్దు జిల్లాలపై పడుతోంది.

ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ఈ ఐదు జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ నెలలో నిజామాబాద్‌ జిల్లాలో 600, కామారెడ్డి జిల్లాలో 400, నిర్మల్‌లో 470, ఆదిలాబాద్‌ జిల్లాలో 250 మంది కొవిడ్ బారిన పడ్డారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోనూ ప్రతిరోజు వందలాది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది.

దీంతో తెలంగాణ సరిహద్దు జిల్లాలు అప్రమత్తమయ్యాయి. కామారెడ్డి జిల్లా పరిధిలోని మద్నూర్‌ చెక్‌పోస్టు.. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూరా.. అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికులు, డ్రైవర్లకు కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే జిల్లాలోకి అనుమతిస్తున్నారు. కందకుర్తి, పోతంగల్‌ వద్ద కూడా తనిఖీలకు ఏర్పాట్లు చేశారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనూ బోర్డర్ దాటే వారికి టెస్టులు కొనసాగుతున్నాయి. అయితే ప్రధాన రహదారులను మాత్రమే ఫోకస్ చేయడంతో ఇతర మార్గాల ద్వారా వచ్చే వారి నుంచి కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశాలున్నాయి. 

Full View


Tags:    

Similar News