Bhainsa: భైంసా గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా
Bhainsa: భైంసాలోని మహాత్మాజ్యోతిబాపూలే బాలుర పాఠశాలలో మరో 25 మంది విద్యార్థులకు కరోనా
Bhainsa: మతఘర్షణలతో అట్టుడుకుతోన్ననిర్మల్ జిల్లా భైంసాలో కరోనా కలకలం కొనసాగుతోంది. భైంసాలోని మహాత్మాజ్యోతిబాపూలే బాలుర పాఠశాలలో గురువారం 176 మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 25 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ఇదే పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులకు బుధవారం కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో వైరస్ సోకిన విద్యార్థుల సంఖ్య 34కి చేరింది.
అప్రమత్తమైన అధికారులు...
ఒకే పాఠశాలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా బారినపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాఠశాలలోని మిగతా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇంకా 140 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మండలంలో విధి నిర్వహణలో ఉన్న 29 మంది పోలీసులకు కొవిడ్ పరీక్షలు చేయగా ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు సెంట్‌పాల్ స్కూల్‌లో ముగ్గురికి, గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునికి కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.