Corona: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల పరేషాన్‌

Corona: తెలంగాణలో కేవలం వారం రోజుల్లోనే రెట్టింపు కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Update: 2021-03-26 04:03 GMT

కరోనా:(ఫైల్ ఇమేజ్)

Corona: తెలంగాణలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఎంతలా అంటే.. కేవలం వారం రోజుల్లోనే రెట్టింపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పంజా విసురుతోంది. చెప్పాలంటే.. గత ఏడాది నవంబరు నెలాఖరులో 502 కేసులు నమోదవగా.. మళ్లీ అదే స్థాయిలో నిన్న 493 కొత్త కేసులు నమోదవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక ఏడాది కిందట నమోదైన కేసులతో పోల్చితే.. ప్రస్తుతం వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెందుతోందని వైధ్యశాఖ చెబుతోంది.

వారం రోజుల్లో దాదాపు 70శాతం పెరగడం...

మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితుల చేరికలు పెరుగుతున్నాయి. వారం రోజుల్లో దాదాపు 70శాతం పెరగడం తీవ్రతకు అద్దం పడుతోంది. ఈనెల 17న ఆసుపత్రుల్లో కరోనా బాధితుల సంఖ్య వేయి 435 ఉండగా.. 24వ తేదీకి ఆసంఖ్య 2వేల 68కి పెరిగింది. ఇందులోనూ ఆక్సిజన్‌, ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారి సంఖ్య 75శాతానికి పైగా అధికంగా నమోదవడం ఆందోన కల్గిస్తోంది.

కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడంతో...

గత నెల వరకు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళతోపాటు గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లోనే కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అంతరాష్ట్ర రాకపోకలు, అంతర్జాతీయ రాకపోకలు పెరగడం.. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడంతో తెలంగాణలోనూ కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతోంది. చెప్పాలంటే ఈనెల 3న 152కేసులు నమోదు కాగా.. 13న 228కేసులు.. 16న 247 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 24వ తేదీ కొచ్చేసరికి ఒక్కసారిగా 493కు పెరిగాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 138కి ఎగబాకింది.

జీహెచ్ఎంసీ సహా...

తెలంగాణలో జీహెచ్ఎంసీ సహా రంగారెడ్డి, మాల్కాజిగిరి, ఆదిలాబాద్‌, జగిత్యాలతోపాటు కరీంనగర్‌, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌ తదితర జిల్లాల్లో వైరస్‌ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్తగా నమోదవుతున్న బాధితుల్లో 40 శాతానికి 11 నుంచి 20 ఏళ్ల లోపు వాళ్లుండడం.. 90శాతం మందికి పైగా బాధితుల్లో ఎటువంటి లక్షణాలు లేకపోవడం వంటి అంశాలు వైరస్‌ మరింత వ్యాప్తికి ప్రమాదకర సంకేతాలుగా కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News