Telangana Congress: నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. ఇవాళే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్

Telangana Congress: గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు నేతల వినతి

Update: 2023-12-04 02:49 GMT

Telangana Congress: నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. ఇవాళే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్   

Telangana Congress: తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతోంది. ఆదివారం రాత్రి గవర్నర్‌ తమిళిసైని కాంగ్రెస్ నేతలు కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం సీఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి పేరు ఖరారు చేసి సాయంత్రం ప్రమాణస్వీకారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈనెల 9వ తేదీలోగా ప్రమాణ స్వీకారం ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించిన తరువాత కాంగ్రెస్​లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. సోమవారమే ప్రమాణ స్వీకారం చేయాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో గవర్నర్​ తమిళి సైని రాజ్​భవన్​లో పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్​రావ్​ ఠాక్రే, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర నేతలు మహేశ్ కుమార్ గౌడ్, ఉత్తమ్​కుమార్​ రెడ్డి, మల్లు రవి మర్యాద పూర్వకంగా కలిశారు. తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం భేటీలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. భేటీ తర్వాత సీఎల్పీ నేత పేరు నివేదిస్తామని గవర్నర్​కు సూచించారు. సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాలని గవర్నర్​ను కోరినట్లు తెలుస్తోంది.

తాజా ఫలితాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలను హైదరాబాద్ రావాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే చాలా మంది శాసనసభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. వీరందరికి గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్​లో మకాం ఏర్పాటు చేశారు. ఉదయమే సీఎల్పీ సమావేశం ఉండడంతో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని నిర్ణయించనున్నారు.

సీఎల్పీ సమావేశానికి డీకే శివకుమార్‌, బోసురాజు, అజయ్‌కుమార్‌, జార్జ్‌, దీపాదాస్‌మున్షీలు పరిశీలకులుగా హాజరవుతారు. ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత సీఎల్పీ చేసిన తీర్మానాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చే సీఎం పేరును ఎమ్మెల్యేలకు చెప్పి అనంతరం గవర్నర్‌ను కలిసి అందజేస్తారు. మరోవైపు ఎన్నికల సంఘం సీఈవో సోమవారం గవర్నర్‌ను కలిసి గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను సమర్పిస్తారు. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ కార్యక్రమం ఉంటుంది. సీఎం ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక ఇంకెవరైనా ఉంటారా అన్నది ఇవాళ తేలనుంది.

మరోవైపు ప్రమాణ స్వీకారోత్సవానికి పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నగరంలోని ముగ్గురు కమిషనర్లకు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఆదేశాలు జారీ చేశారు. సీఎం ప్రమాణ స్వీకారానికి పార్టీ పెద్దలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్​ అదనపు డీజీ బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఉంటుందని మాత్రమే డీకే శివకుమార్ తెలిపారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడనే విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయడం లేదు.

Tags:    

Similar News