బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో కాంగ్రెస్‌కి అందివచ్చిన అవకాశం..?
ప్రజా సమస్యలపై గళాన్ని వినిపించేందుకు.. ఎక్కవ సమయం దొరుకుతుందని భావిస్తున్న కాంగ్రెస్
Telangana: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీరు కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా...? బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుందా....? ప్రజా సమస్యలపై అసెంబ్లీలో లెవనెత్తడానికి కాంగ్రెస్ అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోనుందా...? సీఎల్పీ నేత బట్టి విక్రమార్క వ్యూహం ఏంటి...? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యలే ఎజెండాగా సీఎల్పీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మరీ ఎజెండాను రూపొందించింది.
మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం నుంచే కాంగ్రెస్ వ్యూహత్మకంగా వ్యవహరించింది. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై ఎవరు స్థానాల్లో వారు నిల్చొని కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపితే బీజేపీ నేతలు మాత్రం స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలను మొదటి రోజే సస్పెండ్ చేయడం సంచలంగా మారింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి రోజే సభ్యులను సస్పెండ్ చేయడం చూడలేదని కాంగ్రెస్ నేతలు పైకి చెబుతున్న లోపల మాత్రం సంతోషపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సభలో కాంగ్రెస్ సభ్యులు.. ప్రజా సమస్యలపై తమ గళాన్ని వినిపించడానికి ఎక్కువ సమయం దొరుకుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే టీఆర్‌ఎస్‌తో మిత్రపక్షంగా ఉన్న MIM ప్రజా సమస్యలను లెవనెత్తడం అంతంత మాత్రమే కాబట్టి ఇక సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. ముందు నుంచి అసెంబ్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్రిబుల్ ఆర్ సినిమా చూపిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టి బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలపై పడింది. కానీ సీఎం కేసీఆర్ మొదటి రోజే ట్రిపుల్ ఆర్ సినిమాని వ్యూహతంగా ఫ్లాప్ చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన అవకాశంగా ఉపయోగించుకోవాలని భావిస్తుంది. సభలో ఇక బీజేపీ లేకపోవడంతో ఆ సమయాన్ని కూడా ఉపయోగించుకొని ప్రజల్లోకి మరింతగా వెళ్లాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్.