Lok Sabha Election 2024: మెదక్ బరిలో నీలం మధు.. గెలుపు బాటలో కాంగ్రెస్

Medak Lok Sabha Constituency: మెతుకు సీమ మెదక్‌లో తొలిసారి రసవత్తర పోటీ జరగబోతోంది.

Update: 2024-03-30 14:21 GMT

Lok Sabha Election 2024: మెదక్ బరిలో నీలం మధు.. గెలుపు బాటలో కాంగ్రెస్

Medak Lok Sabha Constituency: మెతుకు సీమ మెదక్‌లో తొలిసారి రసవత్తర పోటీ జరగబోతోంది. ఇన్నాళ్లు డైరెక్ట్ ఫైట్ కాస్తా ఈసారి ట్రైయంగ్యులర్ ఫైట్ గా మారింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ బరిలో నిలిచి సత్తా చాటాలనుకుంటోంది. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జెండా ఎగురేసిన హస్తం పార్టీ ఈసారి మెదక్ గడ్డపై అమీతుమీకి సిద్ధమవుతోంది.

మెదక్ ఎంపీగా ముందుడెన్నడూ లేని విధంగా ఈసారి పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా సాగేలా కన్పిస్తోంది. కాంగ్రెస్ నుంచి నీలం మధు ముదిరాజ్ పోటీలో నిలుస్తోండగా, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మాధవరం రఘునందన్, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పోటీలో నిలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో మెదక్ సెంటిమెంట్ వర్కౌటవుతుందని మూడు పార్టీలు దీమాగా ఉన్నాయి. ఇక్కడ్నుంచి గెలిచి పార్లమెంట్ లో గళం విన్పించాలని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు. ముగ్గురు నేతలకు ఎంపీగా గెలిచి సత్తా చాటాలనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ యువనేత, బీసీ వర్గానికి చెందిన ముదిరాజ్ బిడ్డను పోటీకి దింపింది. 1999 వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఆ తర్వాత ఆ పార్టీలో పరిస్థితుల ప్రభావం కొట్టొచ్చినట్టు కన్పించింది. చివరిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి బాగా రెడ్డి ఇక్కడ్నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీ ఇక్కడ విజయం సాధించడంలో తడబడుతోంది. అయితే తాజాగా కాంగ్రెస్ యువనేతను రంగంలో దించి కాంగ్రెస్ కొత్త ప్రయోగం చేస్తోంది.

తెలంగాణలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ 17 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగినట్టుగా కార్యాచరణతో అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తున్న పార్టీ మెదక్ బరిలో ఈసారి యువనేత నీలం మధు ముదిరాజ్‌కు అవకాశం ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు బరిలో కాంగ్రెస్ పక్షాన కొట్లాడాల్సిన మధు, ఈసారి లోక్ సభ బరిలో హస్తం పార్టీ నుంచి పోటీకి దిగుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ ఆశీస్సులు, రాష్ట్ర పార్టీ ఇన్ చార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి అండదండలతో మెదక్ ఎంపీ సీటును బహుమానంగా ఇవ్వాలని నీలం మధు భావిస్తున్నారు.

మెదక్ నియోజకవర్గం బహుజనలకు కంచుకోట. ఇలాంటి నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మధు ఎన్నికల్లో విజయం సాధించేందుకు నియోజకవర్గంలోని అన్ని సామాజికవర్గాల మద్దతు కోరుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో చర్చలు జరిపిన మధు.. నియోజకవర్గంలో బలంగా ఉన్న బీసీలను తనవైపునకు తిప్పుకొని ఎన్నికల్లో విజయబావుటా ఎగురేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ గొంతుకగా నిలిచిన మెదక్ నియోజకవర్గం మొదట్నుంచి గులాబీ పార్టీని ఆదరించింది. ప్రశ్నించే గొంతుకలకు గళాన్ని ఇచ్చింది.

అందుకే మెదక్ ఎంపీగా బహుజన బిడ్డ, బీసీ వర్గాలకు దన్నుగా నిలిచే మధుముదిరాజ్‌కు పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తెలంగాణలో పార్టీకి మరింత ఊపు వస్తోందని మధు భావిస్తున్నారు. కేంద్రంలోనూ ఈసారి ఇండియా కూటమి అధికారం ఖాయనుకుంటున్న తరుణంలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం ద్వారా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించుకునేందుకు అవకాశం కలుగుతుందని, అభివృద్ధి చేసి చూపిస్తానంటూ జనంలోకి వస్తున్నారు.

Tags:    

Similar News