Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి పర్యటన.. ఇంద్రవెల్లి వేదికగా పార్లమెంట్‌ ఎన్నికలకు శంఖారావం

Revanth Reddy: నాగోబాను దర్శించుకోనున్న సీఎం

Update: 2024-02-02 02:20 GMT

Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి పర్యటన.. ఇంద్రవెల్లి వేదికగా పార్లమెంట్‌ ఎన్నికలకు శంఖారావం

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. తాను సెంటిమెంట్‌గా భావిస్తున్న ఇంద్రవెల్లి నుంచే తొలి అధికారిక పర్యటనకు శ్రీకారం చుట్టారు. దీంతో జల్లావాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే జిల్లాను దత్తత తీసుకుని మరీ అభివృద్ధి చేస్తానని ప్రకటించిన రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో అధికారిక పర్యటనకు వస్తుండటంతో ఎలాంటి వరాలు కురిపిస్తారోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగోబా దర్శనంతో మొదలయ్యే సీఎం పర్యటన జిల్లాలో 4.35గంటలపాటు కొనసాగనుంది. త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలకు ఇదే సభ నుంచి సీఎం శంఖారావం పూరించనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 12.20గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.30గంటలకు ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాగోబా ఆలయానికి బయలుదేరుతారు. 1.45నుంచి 2.15 గంటల వరకు నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ గోపురంతో పాటు వివిధ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. 2.15 నుంచి 3.15గంటల వరకు నాగోబా దర్బార్‌ హాల్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 3.15గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.30గంటలకు ఇంద్రవెల్లిలోని అమరుల స్తూపం వద్దకు చేరుకుంటారు. గిరిజన అమరులకు నివాళులర్పించిన అనంతరం ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్న అమరుల స్మృతివనానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభిస్తారు. 3.50నుంచి 4.50గంటల వరకు ఇంద్రవెల్లి అమరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 4.55గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.

సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక నిర్వహిస్తున్న తొలి అధికారిక పర్యటన కావడంతో విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అమరుల స్తూపం వద్ద నిర్వహించే బహిరంగ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హెలిప్యాడ్‌తో పాటు సభావేదిక, ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. సభకు హాజరయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా సరిపడా కుర్చీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం సభ జరగనుండటంతో ప్రత్యేక లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేక మైదానాన్ని సిద్ధం చేశారు. సీఎం జిల్లాకు చేరుకుని తిరిగి వెళ్లేలోపు జరిగే కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేసేలా జిల్లా అఽధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎస్పీ గౌస్‌ ఆలాం, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఖుష్బూ గుప్తా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రెండు గ్యారంటీలను ఇంద్రవెల్లి సభ నుంచే సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను సీతక్క ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. సీఎం ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.

Tags:    

Similar News