Telangana talli statue: సాధారణ మహిళను పోలినట్టుగా తెలంగాణ తల్లి విగ్రహం..
CM Revanth Reddy to unveil Telangana talli statue: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈనెల 9వ తేదీన సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఫొటోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫొటోలో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో బంగారు ఆభరణాలు, చెవులకు కమ్మలు, కాళ్లకు పట్టీలు, మెట్టెలు ఉన్నాయి. ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, జొన్న కంకులు ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహాం సాధారణ మహిళను పోలినట్టుగా ఉంది.
ఇరవై అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ వద్ద ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట వద్ద చేయించారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన అన్నట్లుగానే కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్ధం చేయించారు. విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ప్రభుత్వం కోరింది.
2009 డిసెంబర్ 9న అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ రోజు సోనియా గాంధీ పుట్టిన రోజు కూడా. అందుకే డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మొదటగా విగ్రహ ఆవిష్కరణను సోనియా గాంధీతో చేయించాలనుకున్నారు. అయితే ఆమె అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు.