CM KCR: నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
CM KCR: *ఆలయ ఉద్ఘాటన పనుల పరిశీలన *వచ్చే నెల 21 నుంచి యాదాద్రి ఆలయ ఉద్ఘాటన
CM KCR: ఇవాళ సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. వచ్చే నెల 21 నుంచి 28 వరకు జరగనున్న యాదాద్రి ఆలయ ఉద్ఘాటన పనులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరుకొని ఆలయ పున:సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు.
అతిథులు, పీఠాధిపతులు యోగులు, స్వామీజీలు, భక్తుల వసతుల పనులు ఎంతవరకు జరిగాయో పరిశీలించనున్నారు. అలాగే ఆలయ దివ్యవిమాన స్వర్ణతాపడం, ధ్వజస్తంభం పనులను తిలకించనున్నారు. ఆలయ నగరి పనులను పరిశీలించి మార్పుచేర్పులు అవసరమైతే పలు సూచనలు చేయనున్నారు. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం పూర్తిస్థాయి నివేదికతో సిద్ధంగా ఉంది.
ఆలయ ప్రాంగణంతోపాటు టెంపుల్ సిటీ, కాటేజీల నిర్మాణాలు, విద్యుదీకరణ, కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం, అన్నప్రసాదం, వ్రత మండపం, గండి చెరువు సుందరీకరణ, బస్ టెర్మినళ్ల వంటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రధానాలయంలో పరంజాలు కడుతుండగా బస్‌బేలు, సత్యనారాయణ వ్రత మండపం, అన్నదాన కేంద్రానికి శ్లాబులను ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరిణి, దీక్షాపరుల మండపం పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రధానాలయానికి స్వాగత తోరణం, ఫ్లైఓవర్ల పనులు జరుగుతున్నాయి. మెట్ల నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉంది.