ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన ఖరారైంది. సీఎం రేపు యాద్రాద్రిని దర్శించనున్నారు. శరవేగంగా కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనుల్ని ఆయన పరిశీలించనున్నారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్న సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్లి స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆదివారం ఆయన యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఒక నివేదక రూపంలో సిద్ధం చేస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో కేసీఆర్ యాదాద్రి వెళ్లారు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు వెళ్తున్నారు. యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మిస్తోంది. దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులతో యాదాద్రిలో ఎక్కడ చూసిన కొత్త నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు యాదగిరిగుట్టను చూసిన వారు ఇపుడు యాదాద్రిని చూస్తే ఆ ప్రాంత అభివృద్ధిని అసలు నమ్మలేకపోతున్నారు. భక్తులకు స్వామి వారి దర్శనం ఎంత ముఖ్యమో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కూడా అంతే లక్ష్యంగా వైటీడీఏ పనులను చేపడుతోంది.