CM KCR: సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలకు సర్వం సిద్ధం

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ్టి నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నారు.

Update: 2021-06-20 05:11 GMT

సీఎం కేసీఆర్(ఫైల్ ఇమేజ్ )

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ్టి నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు తీరు, పురోగతిని స్వయంగా పరిశీలించనున్నారు. ఇవాళ సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారం వరంగల్, మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు సీఎం కేసీఆర్. సీఎం పర్యటన సందర్భంగా అధికారయంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సీఎం పర్యటనలో ఏ గ్రామాన్నైన ఆకస్మికంగా సందర్శించే అవకాశాలున్నాయి.

ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి సిద్దిపేట చేరుకుంటారు. సిద్ధిపేట పర్యటనలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, పోలీస్ కమిషనరేట్, సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనన్నారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి కామారెడ్డి జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. కామారెడ్డిలో సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం, జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. బిక్కనూరు మండలం జంగంపల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్లనిర్మాణాలను సీఎం ప్రారంభించే అవకాశం ఉంది.

సోమవారం రోజున వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. కాకతీయ మెడికల్ కాలేజీలో నిర్మించిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ భవనం, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయాలను ప్రారంభించనున్నారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ధర్మసాగర్‌, ఆత్మకూర్‌, ఐనవోలు మండలాల్లోని పల్లెప్రగతి పనులను తనిఖీ చేసే అవకాశం ఉంది. ఈనెల 22న యాదాద్రిభువనగిరి జిల్లాలో పర్యటిస్తారు. తుర్కపల్లి మండలంలోని తన దత్త గ్రామమైన వాసాలమర్రిని సీఎం కేసీఆర్ సందర్శిస్తారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. గ్రామంలో దాదాపు 3 వేల మందికి సహపంక్తి భోజనం ఏర్పాటు చేయడంతోపాటు గ్రామ సర్పంచ్‌ ఇంటిని సందర్శించనున్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. వాసాలమర్రిలో అధికారయంత్రాంగం మకాం వేసింది. త్వరలోనే ఇతర జిల్లాల్లోనూ సీఎం పర్యటించనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.

Full View


Tags:    

Similar News