రేపు చండూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ
*మరో నాలుగు రోజులు మాత్రమే ప్రచారానికి సమయం
Munugode: మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పార్టీలు దూకుడు పెంచాయి. మరో నాలుగు రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. నవంబర్ 1 సాయంత్రం ఆరుగంటలకు ప్రచారానికి తెరపడనుంది. రేపు చండూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ జరగనుంది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఎపిసోడ్లో ఆడియో లీక్స్‌తో మైలేజ్ వచ్చిందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండగట్టే అవకాశం ఉంది. బీజేపీపై నిప్పులు చెరగనున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సభ రద్దుకావడంతో.. బీజేపీ నేతలు ప్రచారంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఓటర్లను నేరుగా కలవడం ద్వారా ప్రచారం ఉధృతం చేయాలని భావిస్తున్నారు. ఫామ్‌హౌస్ ఎపిసోడ్ అంతా డ్రామా అని మండిపడుతున్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. యాదాద్రిలో ప్రమాణం చేశారు. ఈ ప్రమాణంతో చిత్తశుద్ధి నిరూపించుకున్నామని బీజేపీ భావిస్తోంది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ వ్యవహారం బీజేపీకి సంబంధం లేదని జనంలోకి తీసుకెళ్లగలిగామని కమలనాథులు అంచనా వేస్తున్నారు. అటు చండూర్లో నవంబర్ 1న మహిళా గర్జన సభకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తమ అభ్యర్థి మహిళ కావడం వల్ల ఓట్లు రాబట్టేందుకు ఈ సభ మేలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.