CM KCR: రెండ్రోజుల్లో ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR: రైతు నేతలు, బీజేపీ యేతర ముఖ్యమంత్రులతో సమావేశం
CM KCR: రెండు రోజులు.. రెండే రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీకి బయల్దేరనున్నారు. మొత్తానికి ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నట్లు భావిస్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇందుకు గాను ఢిల్లీ వేదికగా కలిసి వచ్చే నేతలతో మంతనాలు జరపనున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మోడీ విధానాలపై వ్యతిరేకంగా ఉన్న రైతు నేతలతోపాటు బీజేపీ యేతర ముఖ్యమంత్రులతో భేటీ కావాలని భావిస్తున్నారు.
ఇప్పటికే వారం రోజులకుపైగా ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై నిరసన వినిపించారు. అయినా కేంద్రం దిగిరాకపోవడంతో జాతీయ స్థాయిలో కలిసొచ్చే అన్ని పార్టీలు, రైతు, ప్రజా సంఘాలతో కలిసే ప్రయత్నంపై నజర్ పెట్టారు. ఇక మొన్నటి ఢిల్లీ నిరసనకు రాకేష్ టికాయత్ మినహా మిగతా పార్టీల నేతలు ఎవ్వరూ సీఎం కేసీఆర్‌కు మద్దతు ఇవ్వలేదు. దీంతో నూతన సాగు చట్టాలపై జరిగిన రైతు ఉద్యమంలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అవుతున్నారు.
ఇదే సమయంలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మమత బెనర్జీ, స్టాలిన్, దేవెగౌడ, పినరాయ్ విజయన్, వామపక్ష పార్టీల నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ రైతులపై నుండి వెళ్ళడంతో నలుగురు రైతులు మృతి చెందగా ఎనిమిది మంది ఆందోళనలో చనిపోయారు. వీరందరికి మద్దతుగా బీజేపీని టార్గెట్ చేస్తూ జాతీయ స్ధాయిలో పావులు కదిపేందుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు.