Telangana: ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన 50వేల మంది వైద్యులను విధుల్లోకి తీసుకోవాలి- సీఎం కేసీఆర్‌

Telangana: తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌ కష్టకాలంలో ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకు రావాలని యువ వైద్యులకు పిలుపునిచ్చారు.

Update: 2021-05-10 05:30 GMT

సీఎం కేసీఆర్‌(ఫైల్ ఇమేజ్ )


Telangana: తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌ కష్టకాలంలో ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకు రావాలని యువ వైద్యులకు పిలుపునిచ్చారు. కరోనా ఉద్ధృతి పెరుగుతున్న తరుణంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా పనిచేస్తున్న వైద్యారోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించేలా కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన 50 వేల మంది యువవైద్యుల్లో అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్‌ విజృంభణ, కట్టడికి తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందుతున్న వైద్యం తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమీక్షలో అనేక అంశాలు చర్చకు రాగా వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

రెండు, మూడు నెలల కాలానికి వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని సూచించారు. కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యాధికారులను ఆదేశించారు. వారికి గౌరవప్రదమైన రీతిలో జీతాలు అందించాలన్నారు. కరోనా వంటి కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరియైన గుర్తింపు ఇవ్వాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ వెయిటేజీ మార్కులను కలపాలని ఆదేశించారు.

వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను తక్షణమే ప్రారంభించి, వైద్య సిబ్బందిని నియమించాలని సీఎం నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజీఎంకు చెందిన 250 పడకల సూపర్​స్పెషాలిటీ దవాఖానాను, ఆదిలాబాద్ జిల్లా రిమ్స్​ లో మరో 250 పడకలతో నిర్మించిన సూపర్​స్పెషాలిటీ దవాఖానాను తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన 729 మందిని నియమించుకోడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పీఎంఎస్‌ఎస్​వై కింద ఎంజిఎంలో నిర్మిస్తున్న సూపర్​స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటాకింద తక్షణం 8 కోట్లు, రిమ్స్‌కు 20 కోట్ల లెక్కన మొత్తం 28 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖని సీఎం ఆదేశించారు.

Tags:    

Similar News