కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం

CM KCR Tour: ఈ నెల 14 నుంచి ప్రారంభం, వికారాబాద్‌, మేడ్చల్, నిజామాబాద్‌, పెద్దపల్లి

Update: 2022-08-11 01:06 GMT

కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం

CM KCR Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధమైంది. ఓ వైపు మునుగోడు ఉపఎన్నిక హడావుడి, మరోవైపు విపక్షాల దూకుడు కొనసాగుతున్న సమయంలోనే.. కేసీఆర్ జిల్లాల పర్యటన అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జిల్లాల సమీకృత కలెక్టరేట్లు, పార్టీ కార్యాలయాలు, మెడికల్ కాలేజీల శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వాస్తవానికి మునుగోడు ఉపఎన్నిక అనివార్యం కావడంతో.. ముందుగా అక్కడే భారీ బహిరంగ సభతో జిల్లాల పర్యటన మొదలుపెట్టాలని భావించారు. కానీ ఉపఎన్నిక వస్తేనే కేసీఆర్ నియోజకవర్గానికి వస్తారని.. ప్రజలకు వరాలు కురిపిస్తారనే ప్రచారం నేపథ్యంలో.. లేనిపోని చిక్కులు కొనితెచ్చుకోవడం ఎందుకనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మునుగోడుకు ముందే.. జిల్లాలను రౌండప్ చేయాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్‌లు చేస్తున్నారు. అదే సమయంలో క్యాడర్‌కు దిశానిర్దేశం ఇవ్వనున్నారు.

ఇక మొన్నటివరకు మంచిరోజులు లేనందున వాయిదా పడుతూ వచ్చిన జిల్లాల పర్యటన.. ఈసారి త్వరితగతిన పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. తొలుత ఈనెల 14న వికారాబాద్ జిల్లాలో పర్యటిచంనున్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రారంభించడంతో పాటు.. మెడికల్ కాలేజి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. అక్కడే బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 17 న మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత వరుసగా నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కేసిఆర్ పర్యటిస్తారు. ఈ మధ్యలోనే మునుగోడులో సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. జిల్లాల పర్యటనలో భాగంగా.. కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించడంతో పాటు.. కాళేశ్వరం పంప్‌హౌజ్‌ మరమ్మతులను కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News