ఘ‌నంగా సీఎం కేసీఆర్ ద‌త్త పుత్రిక వివాహం

Update: 2020-12-28 13:53 GMT

కన్నతల్లి దూరమైంది. సవితి తల్లి జీవితాన్ని నరకంగా మార్చింది. తండ్రి వత్తాసు పలికాడు. ఏం చేయలేని దుస్థితి. ఎక్కడికి పారిపోలేని పరిస్థితి. చీకటి గదిలోనే నెత్తుటి గాయాలతో సంవత్సరాలు గడిపింది. చావు అంచులదాక వెళ్లి వచ్చింది. కట్‌ చేస్తే.. సీఎం చొరవతో కష్టాలను ఓడించింది. సమాజం అండతో జీవితాన్ని చక్కగా మల్చుకుంది. అనుకున్న ఉద్యోగం సంపాదించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు ఓ ఇంటికి ఇల్లాలిగా మారింది. ఇదంతా వింటుంటే సీఎం దత్తత పుత్రిక ప్రత్యూష లైఫ్‌ గుర్తుకువస్తుంది కదూ. అవును నిజమే ఎన్నో కష్టాలను అనుభవించిన ప్రత్యూష ఇప్పుడు పెళ్లి చేసుకోని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆ పెళ్లికి సంబంధించిన విశేషాలు మీకోసం.

తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం ఘనంగా జరిగింది. సవితి తల్లి చిత్రహింసలు, బాధలు, కన్నీళ్లను భరించి, కష్టాలను ఎదురించి నిలబడిన ప్రత్యూష ఇప్పుడు ఓ ఇంటికి వెలుగులా మారనుంది. హైదరాబాద్‌ రాంనగర్‌కు చెందిన ఉడుముల జైన్‌మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డిని ప్రత్యూష వివాహం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల పంచాయతీలోని పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. పెళ్లి ఏర్పాట్లను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ దగ్గరుండి పర్యవేక్షించారు.

తన బతుకు శూన్యం.. చావడమే శరణం అనుకునే సమయంలో ప్రత్యూష చీకటి జీవితం బయటి ప్రపంచానికి తెలిసింది. ఆమె భరించిన గాయాలను, ఆమె అనుభవిస్తున్న జీవితాన్ని చూసి ఈ సమాజం కళ్ళు చెమడ్చింది. ఆమెను హింసించిన సవితి తల్లిపై దుమ్మెత్తిపోశారు. ప్రత్యూష కష్టాలను చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్ ఆమెను చేరదీశారు. వసతి, చదువు బాధ్యతలను మహిళా శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు.

కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ప్రత్యూష నర్సింగ్‌ చదవాలని సంకల్పించింది. మూడేళ్లపాటు నర్సింగ్‌ కోర్సు పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. తనకు దూరపు బంధువైన చరణ్‌రెడ్డిని వివాహం చేసుకుంది. తనకు జీవితాన్ని ప్రసాధించిన సీఎంకు ప్రత్యూష కృతజ్ఞతలు తెలిపారు.

మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌లో అధికారులు ప్రత్యూషను పెళ్లికూతురుగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ సతీమణి శోభమ్మ హాజరై ప్రత్యూషను ఆశీర్వదించారు. పట్టువస్త్రాలు అందజేసి, డైమండ్ నెక్సెస్ కానుకను అందజేశారు. మరోవైపు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, ఆ శాఖ అధికారులు హాజరై పెళ్లి కూతురిని ఆశీర్వదించారు.

Tags:    

Similar News