Coronavirus Vaccine Clinical Trails: నిమ్స్, కేజీహెచ్ ల్లో క్లనికల్ ట్రయల్స్
Coronavirus Vaccine Clinical Trails: కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా దేశ వ్యాప్తంగా 12 ఆస్పత్రుల్లో తెలంగాణాలో నిమ్స్, ఏపీలో కేజీహెచ్ లు స్థానం దక్కించుకున్నాయి.
Coronavirus Vaccine Clinical Trails: కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా దేశ వ్యాప్తంగా 12 ఆస్పత్రుల్లో తెలంగాణలో నిమ్స్, ఏపీలో కేజీహెచ్ లు స్థానం దక్కించుకున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగే ఈ ప్రక్రియలో ఈ రెండు ఆస్పత్రులు భాగస్వామ్యం వహించడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా చెప్పవచ్చు.
కరోనా ఆట కట్టించేందుకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న 'కొవాక్జిన్' టీకాను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేదిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో మనుషులపై నిర్వహించనున్న క్లినికల్ ట్రయల్స్‌లో తెలుగు రాష్ట్రాలు భాగస్వామ్యం కానున్నాయి. హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12ఆస్పత్రుల్లో విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్‌లో నిమ్స్ చోటు దక్కించుకున్నాయి. ఫాస్ట్ ట్రాక్ కింద ఫేజ్-1, ఫేజ్-2 ట్రయల్స్‌ను ఈ ఆస్పత్రుల్లో చేపడతారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ సారథ్యంలో జరిగే ట్రయల్స్‌కు డాక్టర్ రాజాపంతుల వాసుదేవ్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఆయన జనరల్ మెడిసిన్ విభాగం లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
వ్యాక్సిన్ పనితీరు తుదిదశ పరిశీలనలో భాగంగా జూలై మొదటి వారం నుంచి దేశంలో 12ప్రధాన ఆస్పత్రుల్లో 'కొవాక్జిన్'కు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ ప్రకటించారు. పరీక్షల కోసం ఆరోగ్యవంతులైన వలంటీర్ల ఎంపిక పూర్తయినట్టు సమాచారం. ఇక తుదిదశ ప్రయోగాలు ప్రారంభించడమే ఆలస్యం. ఈ ప్రయోగాలు విజయవంతమైతే ఆగస్టు 15న ఈ వ్యాక్సిన్‌ను అందుబాట్లోకి తెస్తామని భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్ల ప్రకటించారు.
మూడు దశల్లో ట్రయల్స్: 'భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్‌ను మూడు దశల్లో పరీక్షించాల్సి ఉంది. మొదట జంతువులపై పూర్తయింది. రెండోదశ మనుషులపై చేస్తారు. ఆ బాధ్యతలే మాకు అప్పగించారు. ఎటువంటి అనారోగ్యం లేని 18-50ఏళ్ల వారిని ఎంపిక చేసి, వారిపై దఫదఫాలుగా ప్రయోగాలు నిర్వహిస్తాం. ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారంటే.. దాని అర్థం ఆ రోజుకు వలంటీర్లకు ఇచ్చిన వ్యాక్సిన్ ఫలితాలు తెలుస్తాయి. దాంతో వ్యాక్సిన్‌పై నమ్మకం పెరుగుతుంది. అనంతరం డ్రగ్ కంట్రోల్ అథారిటీ అనుమతితో మూడో దశ పరీక్షలు జరుగుతాయి. అవి పూర్తయిన వెంటనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.' - డాక్టర్ వాసుదేవ్.