Hyderabad City buses : నగరంలో ఉన్న సామాన్యులను ఎప్పటికప్పుడు వారి వారి గమ్యస్థానాలకు చేర్చే సీటీ బస్సులు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒక్కసారిగా స్థంబించిన విషయం తెలిసిందే. గత ఆరునెలలుగా రోడ్లపైకి రాని బస్సులు మళ్లీ రొడ్డెక్కుతున్నాయి. హైదరాబాద్ నగర శివార్లలో ఆర్టీసీ బస్సులు పరుగులు పెడుతున్నాయి. సుమారు ఆరు నెలల తర్వాత నగర శివార్లలో ఆర్టీసీ సబర్బన్, ముఫిసిల్ బస్సు సర్వీసులు రోడ్లపై రావడంతో నగరంలో ఉండే సామాన్యులకు కాస్త ఊరట లభించింది.
నగర శివారులోని రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల నుంచి బస్సు సర్వీసులు బుధవారం తెల్లవారుజామునుంచి 200లకు పైగా బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ప్రతి డిపో నుంచి 12 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఈ సర్వీసులను అధికారులు ప్రారంభించారు. నగర శివారులో బస్సులు నడిచినప్పటికీ నగరంలో బస్సుల నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.
కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంబించి పోయిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజుల క్రితమే దశలవారీగా ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులను ఇచ్చింది. దీంతో రాష్ట్రమంతటా బస్సులు నడుస్తున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రయాణికులు హైదరాబాద్ నగరానికి రాకపోకలు సాగిస్తున్నారు. కానీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో నగరంలో బస్సులు నడపాలా వద్దా అనే సంగ్ధిద్దంలో ఉన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కొన్ని ప్రధానమైన రూట్లలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రణాళికలను రూపొందించారు. సిటీలో నిత్యం 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. దీంతో త్వరలోనే సిటీ బస్సులు కూడా నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని ఆర్టీసీ డిపోలను ఉన్నతాధికారులు అలర్ట్ చేశారు. కండక్టర్లు, డ్రైవర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే ఇదే అంశంపై రెండు, మూడు రోజుల్లో అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు.