Nirmal: నేడు నిర్మల్ జిల్లాలో బీజేపీ బహిరంగ సభ, ముఖ్య అతిథిగా అమిత్‌షా
Nirmal: *భారీగా జిల్లాకు తరలివస్తున్న బీజేపీ కార్యకర్తలు *విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్
Nirmal: నిర్మల్ జిల్లాలో కషాయ రంగు పులుముకుంది. ఎక్కడ చూసినా.. ఏ రోడ్డు చూసినా కమలం జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ రోజు జరిగే నిర్మల్ బహిరంగసభకు కేంద్రహోంమంత్రి అమిత్‌షా వస్తుండడంతో బీజేపీ శ్రేణులు భారీగా జిల్లాకు తరలివస్తున్నారు. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కిన వేళ అమిత్ షా సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ రెండు దోస్తీ అంటూ జరుగుతోన్న ప్రచారానికి ఈ సభతో చెక్‌పడుతుందని కమలం నేతలు భావిస్తున్నారు. దీంతో అమిత్ షా ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు నేడు జరిగే కాంగ్రెస్ సభకు ధీటుగా సభ ఉండేలా బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులువేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేసీఆర్ నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్.. అమిత్‌షా రాష్ట్రానికి వస్తుండడంతో యాత్రకు ఒక్కరోజు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఇక ఇవాళ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభతో టీఆర్ఎస్, కాంగ్రెస్ మైండ్ గేమ్ కు చెక్ పెట్టాలని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. గతంలో దక్షిణ తెలంగాణలో పర్యటించిన అమిత్ షా.. ఈసారి ఉత్తర తెలంగాణను సెలెక్ట్ చేసుకున్నారు. రజాకారుల కాలంలో 1000 మందిని ఒకే చోట ఉరి తీసిన ప్రాంతంలో అమిత్ షా సభ జరుగుతుండడంతో ఉత్కంఠగా మారింది.