Setback For IAS Amrapali: ఆమ్రపాలికి తప్పని షాక్

Update: 2024-10-15 13:03 GMT

ఆమ్రపాలి ఏపీకి వెళ్లాల్సిందే: క్యాట్ సంచలన ఆదేశం

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటాతో పాటు మరో నలుగురు ఐఎఎస్ అధికారులు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆదేశాలను పాటించాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ మంగళవారం తీర్పు చెప్పింది.ఏపీ కేడర్ కు చెందిన ఐఎఎస్ లు ఆమ్రపాలి కాటా, ఎ. వాణీప్రసాద్, డి. రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, తెలంగాణ కేడర్ కు చెందిన సృజనలు ఈ నెల 9న డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ క్యాట్ ను ఆశ్రయించారు. వేర్వేరుగా ఈ ఐదుగురు దాఖలు చేసిన పిటిషన్లపై క్యాట్ విచారించింది.

ప్రజలకు సేవ చేయాలని లేదా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ప్రాంతాలకు వెళ్లి వారికి సేవ చేయాలని లేదా? సరిహద్దులో యుద్ధం జరుగుతున్న సమయంలో పనిచేయాలని చెబితే అక్కడ పనిచేయరా?ఇంట్లో కూర్చుని పనిచేస్తారా అని క్యాట్ ఐఎఎస్ లను ప్రశ్నించింది.1986 బ్యాచ్ అధికారులతో ఎలా స్వాపింగ్ చేసుకుంటారని క్యాట్ ప్రశ్నించింది. గైడ్ లైన్స్ లో జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా స్వాపింగ్ చేసుకునే వీలుందని ఐఎఎస్ కౌన్సిల్ వాదించింది.

ఐఎఎస్ ల వాదన ఇదీ...

ఖండేకర్ కమిటీ, డీఓపీటీ ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలా తీసుకోలేదని ఐఎఎస్ లు వాదించారు. ఫస్ట్ పోస్టింగ్, ప్లేస్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఆఫ్ మెట్రిక్యులేషన్, హౌొటౌన్, 371 డి అనే అంశాలు పరిగణనలోకి తీసుకోలేదు. ఖండేకర్ కమిటీ సిఫారసుల ఆధారంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సిఫారసుల ఆధారంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసే ముందు కమిటీ నివేదికను ఇవ్వలేదు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్దమని ఆమ్రపాలి సహా ఐఎఎస్ ల తరపున న్యాయవాది వాదించారు. డీఓపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ఏ కేడర్ అధికారులు ఆ రాష్ట్రానికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.

 హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఐఎఎస్ తరపు న్యాయవాదులు అక్టోబర్ 16న లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేయనున్నారు.క్యాట్ ఆదేశాలు సంతృప్తిగా లేవు. ఈ ఆదేశాలపై తాము హైకోర్టులో సవాల్ చేస్తామని న్యాయవాదులు చెప్పారు.

Tags:    

Similar News