How people ae reacting to enumerators in Caste census survey: మా ఫోన్ నెంబర్లు మీకెందుకు... మా ఆదాయం, ఆస్తులు మీరేం చేసుకుంటారు? అంటూ కులగణన సర్వేకు వెళ్లిన ఎన్యుమరేటర్లను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంటికి వెళ్తిన సిబ్బంది ముఖం మీదే తలుపులు మూసేస్తున్నారు. మరికొన్ని చోట్ల పెంపుడు కుక్కలను వదిలి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు? ప్రజల జీవితాల్లో మార్పులకు ఈ సర్వే చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ సర్వేలో ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకొని ఏం చేస్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
కుల గణన సర్వే ఎందుకు?
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతకుముందు 2018 ఎన్నికల్లో కులగణన చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పేరుతో కులగణనను నవంబర్ 6 నుంచి చేపట్టింది. 26 రోజుల పాటు ఈ సర్వే సాగుతోంది. బీసీల జనాభా ఎంత ఉందనే విషయమై సమాచారం కోసం ఈ సర్వే చేస్తున్నామని చెబుతున్నారు. కానీ, సర్వేలో ఉన్న ప్రశ్నావళిలో ఇతర ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇక్కడే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది.
సర్వే ఎలా చేస్తారు?
ఈ సర్వేలో 56 ప్రధాన ప్రశ్నలు ఉన్నాయి. మరో 19 అనుబంధ ప్రశ్నలున్నాయి. అంటే ప్రజలు మొత్తం 75 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. పార్ట్-1 , పార్ట్ -2 క్వశ్చన్లుంటాయి. ఎనిమిది పేజీల్లో సమాచారాన్ని సేకరిస్తారు. పార్ట్ -1 లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన 60 ప్రశ్నలుంటాయి. రెండో పార్ట్ లో ఆస్తులు, అప్పులకు సంబంధించిన సమాచారం అడుగుతున్నారు. సమగ్ర సర్వేకు వచ్చే సిబ్బంది ఆధార్ సహా ఇతర సర్టిఫికెట్లను తీసుకోవద్దు. కులం, విద్యార్హత, వృత్తి, వార్షిక ఆదాయం, ఇంటి విస్తీర్ణం, ఇతర వివరాలను సర్వే సిబ్బంది కుటుంబ యజమాని చెప్పాలి. ప్రశ్నావళిలో ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పేందుకు జనం నిరాకరిస్తున్నారు.
ఈ సమాచారం ఎందుకు?
కుల గణన సర్వేలోని 75 ప్రశ్నల్లో ఆదాయం, ఆస్తులు, అప్పులకు సంబంధించిన సమాచారం అడుగుతున్నారు. ఇదే సమాచారం ఇచ్చేందుకు ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఆదాయ పన్ను కడుతారా? వార్షిక ఆదాయం ఎంత... వ్యవసాయ భూమి ఉందా.. ఈ కుటుంబం నుంచి ఇతర దేశాలకు వెళ్లినవారు ఎవరైనా ఉన్నారా? వంటి ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఈ సమాచారం చెబితే తమకు నష్టం జరుగుతోందనే అభిప్రాయంతో ఉన్నవారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.లేదా ఈ సమాచారం చెబితే ప్రస్తుతం తమకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు దక్కవనే అనుమానం కూడా ఉంది.
ప్రజా ప్రతినిధిగా పనిచేశారా?
ప్రజా ప్రతినిధిగా ఎప్పుడైనా పనిచేశారా? చేస్తే ఏ పదవిలో ఉన్నారు... ఎంతకాలం ఉన్నారు...నామినేటేడ్ పదవా... ఎన్నికయ్యారా వంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరో వైపు రిజర్వేషన్లు ఎమైనా అందాయా? అందితే ఉద్యోగ, విద్యలో రిజర్వేషన్లు పొందారా? అనే సమాచారం అడుగుతున్నారు. అంతేకాదు గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలి. బీసీ, ఎస్ సీ, ఎస్టీ, ఈబీసీ సర్టిఫికెట్లు పొందారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సమాచారం ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు.
ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వాలి?
ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్ తో బ్యాంకు ఖాతా నెంబర్ అనుసంధానం చేశారు. అయితే ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వడానికి కూడా కొందరు ముందుకు రావడం లేదు. సర్వే పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశం ఉందని తెలంగాణ పోలీస్ శాఖ వార్నింగ్ ఇచ్చింది. పోలీస్ శాఖ మేసేజ్ తో ప్రజలు ఫోన్ నెంబర్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆధార్, పాన్ కార్డు నెంబర్ తెలిస్తే ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తోంది. కులం, ఉప కులం వివరాలు నమోదు చేసుకుంటే సరిపోతోంది. కానీ, ఈ వివరాలు ఎందుకని ప్రజలనుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు
కుటుంబ యజమానితో పాటు ఆ కుటుంబంలో ఉన్న వారి స్థిర, చర ఆస్తుల వివరాలు కూడా అడుగుతున్నారు. కార్లు, మోటార్ బైక్ వంటివి ఒక ఇంటిలో ఎన్ని ఉన్నాయనే సమాచారం కూడా నమోదు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉంటున్న ఇళ్లు ఎన్ని గజాల్లో ఉంది.... ఇది ఏ ప్రాంతంలో ఉంది.. ఇంట్లో ఎన్ని రూమ్ లున్నాయి...ఇంటి యజమాని స్థితి వంటి వివరాలను అడుగుతున్నారు.తమ కుటుంబానికి చెందిన వ్యక్తిగత ఆస్తులు, సంపద వివరాలతో మీకు ఏం పని ఎన్యుమరేటర్లను ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పశు సంపద ఉందా?
వ్యవసాయ కార్యకలాలపాలతో కుటుంబాలకు ఏమైనా సంబంధం ఉందా... ఉంటే ఏ రకమైన సంబంధం ఉంది... ఆ కుటుంబానికి ఉన్న వ్యవసాయ భూమి ఎంత... ఈ కుటుంబంలోని వారికి ఉన్న భూములు ఎన్ని.. ఏ రకమైన భూములు వారి పేరున ఉన్నాయనే సమాచారం ఇవ్వాలి.. మరో వైపు ఎద్దులు, ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, బాతుల సమాచారం ఇవ్వాలి. గత ఐదేళ్లలో అప్పులు తీసుకుంటే ... ఎందుకు తీసుకున్నారు... ఏ బ్యాంకు నుండి తీసుకున్నారో కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలతో ప్రభుత్వానికి ఏం పని అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పార్టీలు ఏమంటున్నాయి?
కుల గణన సర్వేకు ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ అడ్డుపడుతోందని అధికార పార్టీ ఆరోపణలు చేస్తోంది. రాజకీయంగా నష్టపోతామనే భావనతోనే ఈ సర్వేను గులాబీ పార్టీ అడ్డుకుంటుందని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఈ విమర్శలను బీఆర్ఎస్ తోసిపుచ్చుతోంది. సరైన పద్దతిలో సర్వే చేయాలని కోరుతున్నారు.
ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ఎన్యుమరేటర్ల నుంచి సరైన సమాధానం రావడం లేదు. భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల గురించి ఈ సమాచారం ఉపయోగపడుతోందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ప్రజల వ్యక్తిగత సమాచారంతో ఏం అవసరమనేది ప్రశ్న? ఈ ప్రశ్నకు ముందు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి.