తెలంగాణ ఆర్టీసీ వినూత్న పంథాలో దూసుకుపోతోంది

Update: 2020-09-25 06:10 GMT

తెలంగాణా ఆర్టీసీ ప్రారంభించిన కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా సరుకు రవాణా కొనసాగిస్తున్నది. గతంలో పార్సిల్‌-కొరియర్‌ సర్వీసులను ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చారు. ఇప్పుడు సొంతంగా ఈ సేవలను నిర్వహిస్తుండటంతో పార్సిల్‌-కొరియర్‌-కార్గో సేవలతో రోజుకు 10 లక్షల నుంచి 11 లక్షల వరకు సంస్థకు ఆదాయం సమకూరుతోంది. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో సిటీ బస్సులు లేవు. జిల్లాల్లో తిరుగుతున్న బస్సుల్లోనూ 40 శాతంలోపే ఆక్యుపెన్సీ ఉంటున్నది. ప్రస్తుత సమయంలో ఆర్టీసీలో ప్రారంభించిన కొరియర్, పార్సిల్ సర్వీసులే ఆర్టీసీలో లాభాలను ఆర్జీస్తున్నాయి.

తెలంగాణ ఆర్టీసీ వినూత్న పంథాలో దూసుకుపోతోంది. సరుకు- పార్సిల్‌- కొరియర్‌ రవాణాలో ఆర్టీసీ దూసుకుపోతున్నది. అసలే ఆదాయం లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీ అదనపు ఆదాయంపై దృష్టి సాదించింది. ఇప్పటికే ఆర్టీసీలో పార్సిల్, కొరియర్, కార్గో సర్వీసు ప్రారంభించింది. వీటితో పాటు, ఆర్టీసీ పెట్రోల్ బంకులను కూడ ప్రారంబించింది. దీంతో ఆర్టీసీ అధికారులు అనుకున్నదానికంటే రెట్టింపు ఆదాయం వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కొరియర్ సర్వీసులు ప్రైవేటు రేట్లతో పోలిస్తే ఆర్టీసీ పీసీసీ సేవల చార్జీలు తక్కువగా ఉన్నాయి. ఇంటి సామానును తరలించేందుకు కూడా ఆర్టీసీ కార్గోను ఆశ్రయిస్తుండటం మంచి పరిణామం. ప్రస్తుతం బస్టాండు నుంచి బస్టాండు వరకు రవాణా జరుగుతున్నది. మున్ముందు విస్తరణ మరింత పెరిగేకొద్దీ డోర్‌ డెలివరీ సౌకర్యాన్ని కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

గతంలో ఆర్టీసీ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పార్సిల్‌- కొరియర్‌ సేవలను నిర్వహించేది. తద్వారా సంస్థకు నెలకు 70 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చేది. కానీ ఆర్టీసీ సొంతంగా పార్సిల్‌- కొరియర్‌ సేవలు ప్రారంభించిన తర్వాత తొలిరోజు 15 వేలతో మొదలైన ఆదాయం ప్రస్తుతం రోజుకు 10 లక్షలకు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 147 బస్‌స్టేషన్లలో పార్సిల్ కొరియర్ కార్గో సేవలు కొనసాగుతున్నాయి. ఈ రంగంలో డోర్‌ డెలివరీకి ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో సంస్థ ఉద్యోగులను కూడా భాగస్వాములను చేస్తున్నారు. సాధారణ బస్సుల్లోనే పార్సిల్‌- కొరియర్‌కు ప్రత్యేకంగా బాక్సులను ఏర్పాటుచేశారు. దీంతో గంటల వ్యవధిలోనే గమ్యస్థానాలకు చేరుతున్నాయి. ప్రస్తుతానికి ఫోన్‌ నంబర్ల ద్వారా బస్‌స్టాండుల్లోనే పార్సిల్‌- కొరియర్‌లను ఉంచి అందిస్తున్నారు. మున్ముందు డోర్‌ డెలివరీ కూడా చేయనున్నారు. సరకు రవాణా ద్వారా రెట్టింపు ఆదాయం వస్తుండడంతో గ్రామీణ స్థాయిలో పార్సిల్ , కొరియర్ సేవలు బలోపేతం చేసేలా అధికారులు కృషి చేస్తున్నారు.

Tags:    

Similar News