BRS: అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్

BRS: అసెంబ్లీ ఎన్నికల ముందు చేరికలతో గులాబీ పార్టీలో జోష్

Update: 2023-10-22 12:30 GMT

BRS: అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్

BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజులే సమయం ఉండడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఎన్నికల్లో టికెట్లు దక్కని అభ్యర్థులు వలసల బాట పడుతున్నారు. ఏ పార్టీ తమను గుర్తిస్తే ఆ పార్టీలోకి ఎంట్రీ అంటున్నారు నేతలు. ఇక ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇతర పార్టీల్లోని అసంతృప్తులే టార్గెట్‌గా చేరికలు జరుపుతోంది. మరో వైపు తెలంగాణ ఉద్యమకారులంతా తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. పలు కారణాలతో ఉద్యమ పార్టీ వీడి.. ఇతర పార్టీల్లో నేతలంతా.. ఆయ పార్టీలో ఇమడలేక యూటర్న్ తీసుకుంటున్నారు.

ఇక ఉద్యమకాలంలో పనిచేసిన నేతలను గులాబీ బాస్ చేరదీస్తున్నారు. మొదటి నుంచి ఉద్యమంలో కొనసాగి.. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక పలువురు నాయకులు పదవులు రాలేదని, ఎమ్మెల్యే టికెట్‌ దక్కలేదని, గౌరవం లభించ లేదనే కారణాలతో ఆ పార్టీని వీడారు. బీఆర్ఎస్‌ను వీడి ఇతర పార్టీలో చేరినా సరైన గౌరవం లభించడంలేదని సొంత గూటి బాట పట్టారు నేతలు. ఉద్యమ పార్టీ నుంచి ఇతర పార్టీలో చేరిన నేతలతో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు చర్చలు జరుపుతూ తిరిగి పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇంతకాలం అవకాశాలు రాక ఇతర పార్టీలో కొనసాగిన నేతలకు పదవులు ఆఫర్ చేస్తోంది అధికార పార్టీ. అక్కడా సరైన గౌరవం లభించడం లేదని ఘర్‌వాపసీని ప్రారంభించారు. పార్టీ ఆవిర్బావం నుంచి పని చేసిన నేతలకు పెద్ద పీట వేస్తున్నారు.దీంతో అవకాశాలు వస్తుండడంతో సొంతగూటికి వలస వెళ్తున్నారు ఉద్యమకారులు.

తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన ఏపూరి సోమన్నతో ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది బీఆర్ఎస్. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక ఉద్యమకాలంలో కేసీఆర్‌కు కుడి భుజంగా పనిచేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి సైతం తిరిగి బీఆర్‌ఎస్‌ బాట పట్టారు. సీట్ల కేటాయింపు, వ్యక్తిగత కారణాలతో జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ యువజన సమితి పార్టీ ఏర్పాటు చేయడంతో పాటు, బీజేపీలో పనిచేశారు. భువనగిరి అసెంబ్లీ టికెట్‌ ఆశించి కాంగ్రెస్‌లో చేరిన బాలకృష్ణారెడ్డికి కలిసి రాలేదు. ఇక మరో ఉద్యమ నేత చెరుకు సుధాకర్ కూడా కారెక్కారు. కాంగ్రెస్‌లో తనకు అన్యాయం జరిగినా.. పార్టీ పెద్దలు పట్టించుకోలేదనే ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆయన్ను బీఆర్ఎస్‌లే చేర్పించేలా మంత్రి జగదీష్‌రెడ్డి చర్చలు జరిపారు.

ఉద్యమకారులు ఒక్కొక్కరుగా సొంత గూటికి చేరుతున్న నేపథ్యంలో పాత నేతల ఘర్‌వాపసీ చకచకా సాగుతోంది. పార్టీలో చేరుతున్న నేతలంతా సమావేశాలు, సంప్రదింపులు చేయడంలో దిట్టలు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట పార్టీకి ఉపయోగపడతారు అనుకున్న ప్రతి నాయకుడికి గులాబీ కండువా కప్పుతున్నారు పార్టీ అగ్రనేతలు. ఇంతకాలం పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలు.. ప్రస్తుతం అవకాశాల కోసం మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులు తిరిగి చేరుతుండడంతో గులాబీ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. కేసీఆర్‌కు ప్రేమ తప్ప.. పగ ఉండదని.. కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని.. మంచి అవకాశాలు వస్తాయని హామీ ఇస్తు్న్నారు. దీంతో చాలా మంది నేతలు ఇతర పార్టీల చుట్టూ తిరిగి అక్కడ అవకాశాలు రాకపోవడంతో.. మళ్లీ సొంత గూటికి చేరుతున్నారు.

Tags:    

Similar News