Bonalu Festival: రేపటినుంచే గోల్కొండ బోనాలు.. భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు
Bonalu Festival: భాగ్యనగరం బోనమెత్తేందుకు ముస్తాబైంది.
Bonalu Festival: భాగ్యనగరం బోనమెత్తేందుకు ముస్తాబైంది. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబికా అమ్మవారికి రేపే తొలిబోనాన్ని సమర్పించనున్నారు. చారిత్రక నగరంలో ఆధ్యాత్మిక సంబురాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బోనాల ఊరేగింపు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో బోనాలు ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. అటు పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
ఆషాఢం రాగానే మహానగరం ఆధ్యాత్మిక వనంగా మారుతుంది. గల్లిగల్లిల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఆషాఢంలో వచ్చే తొలి ఆదివారం రోజున గోల్కోండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు.
ఉత్సవాల సందర్భంగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. జీహెచ్ఎంసీ, ఆర్కిటెక్ డిపార్ట్ మెంట్ సమన్వయంతో భద్రతను ఏర్పాటు చేశారు. 2వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. గోల్కొండ కోటలో రేపు జరిగే ఉత్సవాల కోసం వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
లంగర్ హౌస్ చౌరస్తా నుంచి గోల్కొడ కోట వరకు దాదాపు 300-400 సీసీ కెమెరాలు ఉన్నాయి. గోల్కొండ కోటలో అదనంగా 36 కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం మొబైల్ టీంలు, స్పెషల్ టీంను రంగంలోకి దింపారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తొట్టెల ఊరేగింపు కొనసాగే బంజారాదర్వాజా, ఫతేదర్వాజా ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. కూడళ్ల వద్ద పికెట్లు ఏర్పాటు చేశారు. ఆలయ కమీటి సభ్యులతో సమావేశమై అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా ఉత్సవాలు జరిగేలా చర్యలు చేపట్టారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖలు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే భక్తులు సహకరించాలని పోలీసులు నగరవాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.