Black Fungus: తెలంగాణ లో బ్లాక్ ఫంగస్...ఒకరి మృతి
Black Fungus: నిర్మల్ జిల్లాలోని భైంసాలో ముగ్గురు ఈ వ్యాధి బారిన పడగా, వారిలో ఒకరు చనిపోయారు.
Black Fungus: కరోనాబారిన పడి ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాం అనే లోపలే మరో మహమ్మారి శరీరాన్ని చుట్టేస్తోంది. తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని భైంసాలో ముగ్గురు ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో ఒకరు చనిపోయారు. దీంతో ఆ జిల్లాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిని హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ఈ విషయంపై తెలంగాణ వైద్య విద్య విభాగం డైరెక్టర్ రమేశ్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులు ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చాయన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులను ప్రైవేటు ఆసుపత్రుల వారు గాంధీకి పంపేందుకు యోచిస్తున్నారని తెలిపారు. కొవిడ్ సోకిన ప్రతిఒక్కరికీ బ్లాక్ ఫంగస్ సోకదని స్పష్టం చేశారు. కొందరు మాత్రమే ఈ వ్యాధి బారిన పడతారన్నారు.
బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్.. కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ముకోర్ అనే ఫంగస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. కరోనా నుంచి కోలుకున్న వారికి రెండు మూడు రోజుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. తొలుత సైనస్లో ఇది చేరి తర్వాత కండ్లపై ఇది దాడి చేస్తుంది. తర్వాత 24 గంటల్లో బ్రెయిన్ వరకు వెళ్తుంది.
ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అయి చనిపోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వారిలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు, అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నది. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకగా తాజాగా తెలంగాణలో ఈ వ్యాధి బయటంతో ఆందోళన చెందుతున్నారు.