కమలం కరెంట్ పోరు.. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా...

BJP - Electricity Charges Hike: ప్రజలపై టీఆర‌్ఎస్ అదనపు భారాలు మోపుతోంది - బీజేపీ

Update: 2022-03-25 04:39 GMT

కమలం కరెంట్ పోరు.. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా... 

BJP - Electricity Charges Hike: తెలంగాణ లో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపి వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టు రాజకీయాలు వాడివేడిగా ముందుకెళ్తున్నాయి. పెరిగిన వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గులాబీ శ్రేణులు నిన్న నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడితే.. పెరగబోతున్న విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కమలం నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో పెట్రోల్ మంటల్లో కమలం కాలిపోతుందని టీఆర్ఎస్ అంటుంటే.. కరెంట్ షాక్ తగిలి కారుపార్టీ మాడి మసైపోతుందని బీజేపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ.. బీజేపీ తీరుకు నిర‌స‌న‌గా టీఆర్ఎస్ శ్రేణులు నిన్న రాష్ట్రవ్యాప్త నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తే.. ఇవాళ బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. విద్యుత్ చార్జీల‌ పెంపుచుతూ టీఆర్ఎస్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యానికి నిర‌స‌న‌గా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలుచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు బీజేపీ నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.

ఆ ప్ర‌కారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిర‌స‌న‌లు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళ‌న‌లు, నిరసనలు చేప‌ట్ట‌నున్న‌ట్లు బీజేపీ తెలిపింది. విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గించేదాకా బీజేపీ పోరు ఆగ‌ద‌ని స్పష్టం చేసింది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై కరెంట్ ఛార్జీల పెంపుతో మోయలేని భారాన్ని మోపిందని మండిపడుతున్నారు. 

ఈ కరెంట్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై ఏకంగా 6 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడం దారుణమని ఆపార్టీ నేత లక్ష్మణ‌్ మండిపడ్డారు. పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడం చేతగాని సీఎం చంద్రశేఖర్ రావు ఫ్రభుత్వం ఆ భారాన్ని సామాన్యులపై మోపడం అన్యాయమన్నారు. చిత్తశుద్ది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లించాల్సిన 48 వేల కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నిస్తున్నారు. 

Tags:    

Similar News