Million March in Telangana: తెలంగాణలో మరో మిలియన్‌ మార్చ్‌ జరగబోతుందా..?

Telangana: తెలంగాణలో పార్టీ బలోపేతం, టీఆర్ఎస్‌పై రాజకీయ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని బీజేపీ భావిస్తోంది.

Update: 2021-11-02 10:45 GMT

తెలంగాణలో మరో మిలియన్ మార్చ్ (ఫైల్ ఇమేజ్)

Million March in Telangana: తెలంగాణలో మరో మిలియన్‌ మార్చ్‌ జరగబోతుందా..? యువత, నిరుద్యోగులతో సైరన్‌ మోగనుందా..? ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వడివడి అడుగులు పడుతున్నాయా? కమలనాథుల వ్యూహం ఏంటి?

తెలంగాణలో పార్టీ బలోపేతం, టీఆర్ఎస్‌పై రాజకీయ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టే దిశగా ప్రణాళికలు రచించింది. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే అంశంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మిలియన్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. ఇక దీపావళిలోగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే నిరుద్యోగులతో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని బండి సంజయ్‌ సర్కార్‌కు అల్టిమేటం చేశారు.

నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళన చేపట్టేందుకు బీజేపీ నేతలు సన్నద్ధమవుతున్నారు. అంతేకాదు.. బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగిన పదాధికారుల సమావేశంలో ఈ కీలక అంశాలపైనే చర్చించారు. అదేవిధంగా ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత తేదీని కూడా నిర్ణయించారు. కాంగ్రెస్‌ కన్నా ముందుగానే భారీ నిరసన కార్యక్రమం చేపట్టేందుకు రెడీ అయ్యారు. నవంబర్‌ 12న ట్యాంక్‌ బండ్‌పై నిరుద్యోగ మిలియన్‌ మార్చ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీనికిగాను హైదరాబాద్‌కు యువత, నిరుద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 2 లక్షల ఖాళీలు ఉంటే 30వేలు మాత్రమే భర్తీ చేశారని తెలియజేశారు. ఇక ఉద్యోగాల కోసం యువత తరపున బీజేపీ పోరాడుతుందన్నారు ఎమ్మేల్యే రాజాసింగ్‌.

మొత్తానికి 2023లో గెలుపే లక్ష్యంగా సమాయత్తమవుతోన్న కమలనాథులు.. రాష్ట్ర సర్కార్‌ను ఇబ్బంది పెట్టాలని టార్గెట్‌ పెట్టుకుంది.

Tags:    

Similar News