Huzurabad By-Election: ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్
*కమలాపూర్ బూత్ నెం.262లో ఓటు వేసిన ఈటల *హుజూరాబాద్ బైపోల్‌లో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు
Huzurabad By-Election: హుజూరాబాద్ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో బారులు తీరారు. ఇక ఉదయం 10 గంటల వరకు హుజూరాబాద్‌లో 15శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. బూత్ నెంబర్ 262లో ఓటు వేశారు ఈటల. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదిలా ఉంటే హుజూరాబాద్ బైపోల్‌లో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. జమ్మికుంటలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు.
జమ్మికుంట జూనియర్ కాలేజీ వద్ద ఇద్దరు నాన్‌లోకల్ వ్యక్తులను పట్టుకొని వారిని తరిమికొట్టారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. మరోపక్క స్థానికేతరులు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. డబ్బులు పంచుతున్న వ్యక్తిని బీజేపీ నేతలు అడ్డుకొని బయటకు పంపారు.
అటు వీణవంక మండలంలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్కల్ వద్ద టీఆర్‌ఎస్, బీజేపీ బాహాబాహీకి దిగాయి. పోలింగ్ కేంద్రంలో ఇరువర్గాలు కొట్టుకున్నాయి. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గణుముక్కలలో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
పోలింగ్ బూత్ వద్ద టీఆర్‌ఎస్ తరపున ప్రచారం చేస్తున్నారంటూ కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. దీంతో ఇరుపార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కౌశిక్‌రెడ్డిని అక్కడి నుంచి బయటకు పంపించారు.