BJP-Janasena: తెలంగాణలో దాదాపు ఖరారైన బీజేపీ, జనసేన పొత్తు

BJP-Janasena: చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్న బీజేపీ, జనసేన

Update: 2023-10-25 14:15 GMT

BJP-Janasena: తెలంగాణలో దాదాపు ఖరారైన బీజేపీ, జనసేన పొత్తు

BJP-Janasena: తెలంగాణలో జనసేన పార్టీతో పొత్తుకు బీజేపీ కసరత్తు వేగవంతం చేస్తోంది. ఇవాళ హస్తిన వేదికగా పొత్తుపై కీలక సమావేశం జరగబోతుంది. ఇటీవలే జనసేన అధినేత పవన్ తో టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమావేశమై తెలంగాణ ఎన్నికల్లో పొత్తు గురించి చర్చించగా.. ఇవాళ్టి సమావేశంతో పొత్తుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో తమ పార్టీ పోటీ చేస్తుందంటూ రీసెంట్ గా జనసేన ప్రకటించింది. దాంతో జనసేనను కలుపుకొనే బరిలో దిగాలని కమలనాథులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పవన్ ను కలిశారు. గతంలో ఏపీ ఎన్నికల్లో, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేశామని.. ఈసారి జరిగే తెలంగాణ ఎన్నికల్లో తాము పోటీ చేయడం అనివార్యమని పవన్ తెలిపారు. కనీసం 12 సీట్లలో అయినా పోటీ చేస్తామని జనసేన ప్రతిపాదించగా.. బీజేపీ అధిష్టానం మాత్రం 6 నుంచి 8 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే బీజేపీ 52 మందితో తొలి జాబితా ప్రకటించగా.. జనసేనతో పొత్తుపై క్లారిటీ వచ్చాకే సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమిత్ షాతో భేటీ కోసం తెలంగాణ బీజేపీ నేతలు, జనసేన నేతలు ఇప్పటికే ఢిల్లీ పయనమయ్యారు. టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తో పాటు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ , నాదెండ్ల మనోహర్ ఢిల్లీ బాట పట్టారు. తెలంగాణలో కలిసి పోటీ చేసే అంశంపై బీజేపీ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. అధిష్టానంతో చర్చల అనంతరం తెలంగాణలో కలిసి పోటీ చేయాలా..? మద్దతు తీసుకోవాలా..? అనే అంశంపై క్లారిటీ రానుంది.

Tags:    

Similar News