ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గంలో కాంగ్రెస్ పాదయాత్ర
Khammam: పాదయాత్రలో ప్రభుత్వంపై భట్టి ఘాటు విమర్శలు
Khammam: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సిఎల్పీనేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర చేస్తున్నారు. పీపుల్స్ మార్చ్ నాలుగోరోజు కొనసాగుతోంది. భారీగా తరలి వచ్చిన మహిళలు భట్టి విక్రమార్కకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. చిరుమర్రి, స్టూవర్టుపురం, న్యూ లక్ష్మీపురం వరకు యాత్ర సాగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు భట్టి విక్రమార్కను గజమాలతో సత్కరించారు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబడుతున్నారు. రైతు బంధు పేరిట అన్నదాతకు ప్రభుత్వం చేస్తున్న సాయం చాలా స్వల్పమని ఆరోపించారు భట్టి విక్రమార్క. సిఎం కేసీఆర్ వరి వేస్తే ఉరే అనడంతో ప్రజలు ప్రత్యామ్నాయ పంటలవైపు చూశారని నకిలీ విత్తనాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని భట్టి డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో కేవలం రైతులే కాదు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన ఉద్యోగులు కూడా ప్రభుత్వ విధానాలపై ఆగ్రహంతో ఉన్నారన్నారు భట్టి విక్రమార్క. ఉద్యగుల పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో ఖర్చు చేస్తున్న లక్షల కోట్ల రూపాయలకు ప్రతి పైసాకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.