భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే మొదటి, రెండో దశ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేయగా మూడో దశకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించింది. జంతువులతో పాటు మనుషులపై జరిగిన మొదటి, రెండు దశల పరీక్షల ఫలితాలను అనుసరించి మూడో దశకు అనుమతులు మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 25వేలకు పైగా వాలంటీర్లతో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. నవంబర్ మొదటి వారంలో కొవాగ్జిన్ మూడో దశ ట్రయిల్ ప్రారంభించనున్నట్లు వివరించింది.
క్లినికల్ ట్రయల్స్ తొలిదశలో 45మందికి, రెండో దశలో 55 మందికి నిమ్స్‌లో టీకా ఇవ్వగా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యాంటీబాడీలు కూడా అభివృద్ధి చెందాయని చెప్పారు. మొదటి, రెండో దశ కలిపి మొత్తం వంద మంది వాలంటీర్లు ఇందులో భాగస్వాములు అయ్యారు. ఇప్పటివరకు టీకా తీసుకున్నవారిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వివరించారు. దాదాపు ఆరు నెలల పాటుగా వాలంటీర్ల ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు. మూడో దశ పరీక్షల్లో భాగంగా నిమ్స్‌లో మరో 2వందల మందికి టీకా ఇచ్చే అవకాశం ఉంది.