భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక..భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం
Bhadrachalam Godavari Flood : గత మూడు రోజులుగా ఉత్తర తెలంగాణలో కురుస్తోన్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి.
Bhadrachalam Godavari Flood : గత మూడు రోజులుగా ఉత్తర తెలంగాణలో కురుస్తోన్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. ఎగువన ఉన్న ఉపనదులు, వాగులు వంకల్లో వరద నీరు చేసి పొంగి ప్రవహిస్తు గోదావరిలో చేరుతుండడంతో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకరస్థాయిని దాటడంతో జిల్లా కలెక్టర్ ఎం.వి. రెడ్డి భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. గోదావరి సమీప ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టర్ ఆఫీసులో ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో వరద పరిస్థితిని సమీక్షించారు. అడిషనల్ కలెక్టర్ అనుదీప్ అశ్వాపురం మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు.
ఇక పోతే భద్రాచలం వద్ద శనివారం తెల్లవారు జామున 3.50 గంటలకు గోదావరి వరద 43 అడుగులకు చేరింది. ప్రస్తుతం గోదావరి వరద 46 అడుగులు దాటింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చటిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ప్రవాహం మరింత పెరుగుతుండడంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా ఈ రోజే జారీ చేసే అవకాశం ఉంది. ఇక జిల్లాలో ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాలకు శబరి, గోదావరి నదుల ప్రవాహం పెరిగిపోయింది. దీంతో సమీపంలో ఉన్న గ్రామాల రహదారులు మునిగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 9.84 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ఆంధ్రాలో గోదావరి ఉగ్రరూపం దాలుస్తుండడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.