Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్
Bandi Sanjay: కరీంనగర్‌లోని నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అర్ధరాత్రి కరీంనగర్‌లోని బండి సంజయ్ ఇంటికి వెళ్లిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 151 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి.. ప్రివెంట్ మోషన్ కింద అరెస్ట్ చేశారు. బండి అరెస్ట్‌తో ఆయన నివాసం ముందు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బండి సంజయ్‌ను కరీంనగర్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పీఎస్‌కు తరలించారు.
బండి సంజయ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో.. బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. అరెస్ట్ చేయొద్దంటూ సీఐ కాళ్లు పట్టుకున్నారు. దీంతో బండి ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇక బండి సంజయ్ ఇంటిముందు ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
బండి అరెస్ట్‌పై హెచ్ఎంటీవీతో మాట్లాడిన ఆయన కొడుకు భగీరథ.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పలేదని తెలిపాడు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని.. అడిగితే ప్రివెంట్‌మోషన్ అని చెప్పారన్నాడు. ఒక్కసారిగా దాదాపు 40 మంది పోలీసులు ఇంటికి వచ్చారన్నారు బండి సంజయ్ భార్య అపర్ణ. బండి సంజయ్‌ని ఎలాగైనా అరెస్ట్ చేయమని సీపీ చెప్పారని పోలీసులు చెప్పినట్లు తెలిపారు. అరెస్ట్ వారెంట్ చూపించకుండా సంజయ్‌ను అరెస్ట్ చేశారన్న అపర్ణ.. బీజేపీ కార్యకర్తలను పోలీసులు బూటుకాలుతో తన్నారన్నారు. ఒక ప్రజాప్రతినిధిని ఇంత దారుణంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఇక బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పీఎస్‌కు తరలించారు పోలీసులు. దీంతో బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్టేషన్‌కు భారీగా చేరుకుంటున్న బీజేపీ కార్యకర్తలు స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు.