Balapur Ganpati Utsav Committee Decisions: బాలాపూర్ లడ్డూ వేలంపై ఉత్సవ కమిటీ నిర్ణయం
Balapur Ganpati Utsav Committee Decisions: ప్రతి ఏడాది పండగలు, ఉత్సవాలను రాష్ట్ర ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకునే వారు. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో దాని ప్రభావం పండగలు, ఉత్సవాలపై అందరూ ఇండ్లకే పరిమితమై జరపుకుంటున్నారు. అందుకు నిదర్శనంగా ఈ ఏడాది ఎలాంటి కోలాహలం లేకుండా జరిగిన హోలి, రంజాన్, బోనాల పండగలే. ముందెన్నడూ జరగని రీతిలో ఈ సారి బోనాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి.
ఇక ఇదే క్రమంలో వచ్చే నెలలో మరో పండగ కూడా రానుంది. ప్రజలందరూ నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలు రానున్న రోజుల్లో మొదలు కానున్నాయి. అయితే కరోనా వైరస్ ప్రభావం రానున్న వినాయకచవితి ఉత్సవాలపైనా పడుతోంది. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకున్న బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ గురువారం ఉదయం సమావేశమైంది. ఈ సమావేవంలో కొన్ని అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది.
కమిటీ సభ్యులు ముఖ్యంగా వినాయకుడి విగ్రహం ఎత్తు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది 21 అడుగుల విగ్రహానికి ప్రతిష్ఠించే వారు. కానీ ఈ సారి దానికి బదులుగా ఆరడుగుల ప్రతిమను మాత్రమే ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నారు. ప్రతి ఏడాది లక్షల్లో వేలం పాడే లడ్డూ వేలం కార్యక్రమాన్ని కూడా ఈ సారి రద్దు చేసినట్టు కమిటీ నిర్ణయం తీసుకుంది. ఏటా ఈ లడ్డూ రూ.లక్షలు పలుకుతుంది. గతేడాది వేలంలో బాలాపూర్ లడ్డూ రూ.17.60 లక్షలు పలికింది. ఏటా బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో లడ్డూ వేలం కార్యక్రమానికి ఎనలేని ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇక్కడి ప్రతిమకు నిత్యం చేసే పూజల విషయానికొస్తే గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మాత్రమే తొలిపూజ నిర్వహించనున్నట్లు కమిటీ ప్రకటించింది. గణేశ్ శోభాయాత్రపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఉత్సవ కమిటీ తెలిపింది.