రామ మందిర నిర్మాణం విరాళాలపై తెలంగాణలో మాటల మంటలు

Update: 2021-02-02 08:19 GMT

Representational Image

అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం విరాళాలపై తెలంగాణలో మాటల మంటలు రేపుతున్నాయి. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు చేస్తున్న ఆరోపణలు కారు పార్టీకి కమలం పార్టీ మధ్య పరస్పర దాడులకు దారి తీస్తున్నాయి. రాముని గుడి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదంటూనే గులాబీ పార్టీ బీజేపీని టార్గెట్‌ చేస్తుండటం ఉద్రిక్తతకు కారణం అవుతోంది.

తెలంగాణలో టీఆర్ఎస్‌ వర్సెస్ బీజేపీలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల నుంచి ఈ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు డైలాగ్‌ వారు నడుస్తోంది. బల్దియా ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్‌, బీజేపీల మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లతో భాగ్యనగరంలో ప్రచారాన్ని హోరెత్తించారు.

 ఇక ఇప్పుడు అయోధ్య రామయ్య గుడికి విరాళాల సేకరణకు హెచ్‌పీ, బీజేపీ, సంఘ్‌ పరివార్‌ నేతలు ఇంటింటికి తిరుగుతుండటంతో ఈ రెండు పార్టీల మధ్య వైరం మరింత ముదురుతోంది. తమకు భద్రాద్రి రాముడు లేడా అయోధ్య రాముడు తమకెందుకని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతో ప్రతిఘటన మొదలయ్యింది. తర్వాత పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విరాళాల లెక్కలు అడగడం వరకు చేసిన వ్యాఖ్యలు బీజేపీని రెచ్చగొట్టినట్లయ్యింది. ఇరుపార్టీల నేతలు వరంగల్‌లో పరస్పరం దాడులు చేసుకునే వరకు దారి తీసింది. ఏకంగా పరకాల ఎమ్మెల్యే నివాసంపై బీజేపీ నేతలు దాడికి దిగారు. దీనికి ప్రతీగా టీఆర్ఎస్‌ నేతలు బీజేపీ కార్యాలయంపై దాడులు చేశారు. చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి నేపథ్యంలో టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బీజేపీ తీరుపై మండిపడ్డారు.

రామయ్య గుడి నిర్మాణం కోసం అయోధ్య రామతీర్థ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బీజేపీ మరియు సంఘ్‌ నేతలు విరాళాలు సేకరిస్తున్నారు. విరాళాల సేకరణ కోసం గల్లి గల్లి ఇల్లిళ్లు తిరుగుతుండటం.. ప్రతి ఇంటిని టచ్‌ చేస్తుండటం టీఆర్ఎస్‌ నేతలను ఆందోళనకు గురి చేస్తోందన్న చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News