సైలెంట్‌గా ఉండే కొప్పుల...ఎందుకు వైలెంట్ అయ్యారు?
Koppula Eshwar: సంక్షేమ శాఖకు ఆయనో మంత్రి. సౌమ్యుడుగా పేరున్న పెద్ద మనిషి.
Koppula Eshwar: సంక్షేమ శాఖకు ఆయనో మంత్రి. సౌమ్యుడుగా పేరున్న పెద్ద మనిషి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేత. ఉద్యమ పార్టీలో అధినేత కేసీఆర్‌కు కుడిభుజం. ఆరుసార్లు ఎమ్మెల్యే ఒకసారి చీఫ్ విప్. ప్రస్తుతం కేబినెట్ మినిస్టర్. అలాంటి నాయకుడు ఓ ఫోన్‌లో మాట్లాడిన మాటలు వైరల్‌గా మారి సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక తన ప్రత్యర్థుల చేతికో కొత్త ఆయుధాన్ని ఆయనే అందించారని అంటున్నారంతా. ఇంతకీ ఎవరా మంత్రి? ఏమిటా వైరల్ అవుతున్న కాల్ రికార్డ్? ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు ఉండగా ఎందుకు బేరాలడారు? ఇంతకీ విపక్షానికి ఆయనిచ్చిన అస్త్రం ఏమిటి?
ఆయనే కొప్పుల ఈశ్వర్. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి. టీఆర్‌ఎస్ పార్టీలో సీనియర్ మాత్రమే కాదు మంచి సిన్సియర్ అనే బిరుదు కూడా సంపాదించుకున్నారు. తన పని ఏదో తాను చేసుకు వెళ్లే రకం. ఎలాంటి పరిస్థితి వచ్చినా మౌనమే సమాధానం అంటారు. అలాంటి ఈశ్వర్ హఠాత్తుగా బరస్ట్ అయ్యారు. అది కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో!! ఫోన్ కాల్స్ చేయడం, ఎన్నికల నిబంధనలను విస్మరించి ఓట్ల కోసం బేరాలాడడం అది కూడా ఒక ఎంపీటీసీ సభ్యునితో ఫోన్‌లో సంభాషించడం అన్నీ సంచలనానికి కారణమయ్యాయి.
ఈ ఫోన్ కాల్‌లో పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్‌లో పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుపై అసందర్భ కామెంట్స్ ఎందుకు చేశారో తెలియక క్యాడర్, లీడర్ తికమకపడుతున్నారట. అధిష్టానమే ఆయనతో అలా మాట్లాడించి ఉంటుందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయట. పుట్ట మధు ఈటలకు సన్నిహితుడు కావడం వల్ల అలవాట్‌లో పొరపాటుగా మాట్లాడి ఉంటారని కూడా అనుకుంటున్నారట. కానీ పార్టీ వ్యవహారం బయటకు మాట్లాడడం ఎంత వరకు సబబు అని గొణుక్కుంటున్నారట.
ఎన్నికల వేళ ఓటర్లకు గాలం వేయడం ఎంత సహజమో డబ్బిచ్చి ప్రలోభాలకు గురి చేయడం అంతే సహజం. కానీ, అధికార పార్టీలో సీనియర్ నాయకుడు అయి ఉండీ అదీ క్యాబినెట్ ర్యాంక్ హోదా మినిస్టర్ అయి ఉండీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడంపై దుమారం చెలరేగుతోంది. కాసేపు. ఇదంతా పక్కన పెడుదాం. కొప్పుల ఈశ్వర్ ఆరగేరా నాయకుడు కాదు. ఇందాక చెప్పుకున్నట్టు సీనియర్ లీడర్. సిన్సియర్ లీడర్. అంతకుమించి తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి. అలాంటి కొప్పుల ఫోన్ కాల్ వాయిస్ రికార్డ్ ఎలా బయటికి వచ్చిందన్నదే అసలు ట్విస్టు.
ఇన్నాళ్లూ మర్యాద రామన్నగా ఉన్న కొప్పుల అమర్యాదగా మాట్లాడి తన పరువు తానే తీసుకున్నారన్నది క్యాడర్ మాట. ఇంతకాలం ఎవరి జోలికి వెళ్లని ఈశ్వర్ అవసరం లేకున్నా ఇంకొకరిని వివాదంలోకి లాగారనీ, పుట్ట మధు రాజకీయ భవిష్యత్‌పై ఇప్పటికే వివిధ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న వేళ ఈయన చేసిన కామెంట్స్ వాటికి బలం చేకూర్చినట్టుగా మారిందని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఈ కాల్ రికార్డింగ్ ఇంటిగుట్టును బయట పెట్టడమే కాకుండా పార్టీలో, ప్రభుత్వంలో కొత్త సంక్షోభానికి తెరతీసిందన్న టాక్ వినిపిస్తోంది.
ఒక మంత్రిగా, పార్టీ పరువే కాదు ప్రభుత్వ పరువును కాపాడాల్సిన గురుతర బాధ్యతను విస్మరిస్తూ తానే స్వయంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లకు డబ్బుల బేరసారాలు సాగించారని సోషల్ మీడియాలో ఓ చర్చ వైరల్ అవుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ముఖ్య నాయకుడిపై ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక అధిష్టానం ఆదేశమా అన్న విషయం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట ఆ జిల్లా గులాబీ తమ్ముళ్లు. అసలే హుజురాబాద్ పరిణామంతో బీజేపీ బలపడుతున్న వేళ మంత్రి కామెంట్స్ గులాబీ పార్టీని మరింత ఇరుకున పెట్టేలా చేశాయన్నది వారి వాదన.
ఏమైనా పెద్దపల్లి జిల్లాలో ఉన్న ముగ్గురు ముఖ్య నేతల్లో ఈటలకు సన్నిహితులుగా ఉన్న ఆ ఇద్దరిని మంత్రే పొమ్మనలేక పొగబెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇదే అదనుగా మంత్రి కొప్పుల పబ్లిక్‌గా ఓటర్లను కొనుగోలు చేయడంపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయబోతున్నారట నేతలు. లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఇలాంటివి ఇంకెన్ని ట్విస్ట్‌లు బయటికి వస్తాయో చూడాలి.