ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ మాటలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా నమోదు (ఎన్ఆర్సీ)పై ముస్లింలను ఇతరులు తప్పుదోవ పట్టించడానికి మేము చిన్న పిల్లలం కాదని ఒవైసీ అన్నారు. విజయ దశమి సందర్భంగా నాగపూర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మోహన్ భగత్ మాట్లాడుతూ సీఏఏ పేరుతో అవకాశవాదులు నిరసనలతో హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. 'సీఏఏను సంబంధిత మతం వారు వ్యతిరేకించలేదు. ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకించే వారే మన ముస్లిం సోదరులను తప్పుదారి పట్టించారు. ముస్లిం జనాభా నియంత్రణ కోసమే అన్నట్లుగా అబద్ధపు ప్రచారం చేశారు ' అని వ్యాఖ్యానించారు.
ఈ మాటలకు స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ వెంటనే కౌంటర్ ఇచ్చారు. సీఏఏ, ఎన్ఆర్సీ ముస్లింలకు వ్యతిరేకం కాకపోతే ఆ చట్టాల్లో మత ప్రస్తావనలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పుదారి పట్టడానికి తాము పిల్లలం కాదన్నారు. తమ నిరసనల సందర్భంగా కాంగ్రెస్, ఆర్జేడీ ఇతర పార్టీల మౌనాన్ని కూడా తాము మరిచిపోమని ఆయన అన్నారు. మా భారత జాతీయతను ప్రశ్నించే, మతపరమైన పౌరసత్వానికి సంబంధించిన చట్టాలకు వ్యతిరేకంగా తాము పోరాడుతూనే ఉంటామని అసదుద్దీన్ స్పష్టం చేశారు.