అక్టోబర్ 6 న కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాల పై ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం !

Update: 2020-10-01 06:46 GMT

తెలుగు రాష్ర్టాల మధ్య జల వివాదాల పరిష్కారంపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీని మరోసారి ప్రకటించింది కేంద్రం. ఇప్పటికే పలు ధపాలుగా వాయిదా పడుతూ వచ్చిన సమావేశం అక్టోబర్ ఆరున జరగనున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు లేవనెత్తిన అంశాలు, కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్‌ చర్చించనుంది. ఈ సారైనా నదీ జలాల వివాదాలకు బ్రేక్ పడుతుందా లేదా తేలనున్నది.

వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారయ్యింది. అక్టోబర్ 6వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగనున్నది. మొదట ఆగస్టు 5న సమావేశం జరగాల్సి ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్ విముఖత చూపుడంతో వాయిదా పడింది. దీంతో ఆగస్టు 25న జరిపేందుకు సిద్ధమయ్యారు. అయితే అనుకోకుండా శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరగడం మరోవైపు గజేంద్రసింగ్‌కు కరోనా సోకడంతో కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది.

కృష్ణా,గోదావరి నదీ జలాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు పరస్పరం ఆయా రివర్ మేనేజ్ మెంట్ బోర్డులకు ఫిర్యాదు చేశాయి. రెండు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు లేవనెత్తిన అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులపై కేంద్రం, ఏపీ ప్రభుత్వం లేవనెత్తుతున్న సందేహాలకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో క్లారిటీ ఇవ్వనున్నట్లు ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదే సమయంలో ఏపీ ప్రాజెక్టులపై తమ అభ్యంతరాలను కూడా కౌన్సిల్ లో హైలెట్ చేస్తామని స్పష్టం చేశారు. పోతిరెడ్డి పాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు. నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా ఏపీ సర్కార్‌ నీటిని తరలిస్తోందని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ఇదే విషయాన్ని అపెక్స్ భేటీలో లేవనెత్తనున్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్ సమావేశానికి హాజరుకానున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, జల వివాదాలు ఇతర అంశాలపై ఏ స్థాయిలో చర్చ సాగుతోంది వివాదాల పరిష్కారానికి ముందుడుగు పడుతుందా? అనే విషయం వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News