నీటి వాటాలు: ఏపీ, తెలంగాణ వాదనలు ఇవీ....

Telugu States: తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తయినా రెండు రాష్ట్రాల మధ్య ఇంకా సమస్యలకు పరిష్కారం కాలేదు.

Update: 2024-07-04 13:00 GMT

నీటి వాటాలు: ఏపీ, తెలంగాణ వాదనలు ఇవీ....

Telugu States: తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తయినా రెండు రాష్ట్రాల మధ్య ఇంకా సమస్యలకు పరిష్కారం కాలేదు. అందులో మరీ ముఖ్యంగా నీటివాటాల సంగతి ఇంకా పెండింగ్ లోనే ఉంది. గతంలో సీఎంలు, సీఏస్ ల స్థాయిలో సమావేశాలు జరిగినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఈ నేపథ్యంలో మరోసారి రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అవుతున్నారు. వారి భేటీకి హైదరాబాద్ ప్రజాభవన్ వేదిక అవుతోంది. మరి ఇంతకీ నీటివాటాలపై వివాదంగా మారిన అంశాలేంటి?

తెలంగాణ ఏర్పడి పదేళ్లయింది. అయినా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఇరు రాష్ట్రాలు ఎవరి ప్రయోజనం వారు కోరుకోవడంతో అనేక సమస్యలు పెండింగ్ లో పడిపోయాయి. గత పదేళ్లుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ దగ్గర 31 సమావేశాలు జరిగాయి. అయినా వాదనలు వినడమే తప్ప కేంద్ర హోంశాఖ చేసిందేమీ లేదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ సీఎంకు లేఖ రాయగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశం నిర్వహణకు ఓకే చెప్పారు. ఈ నెల 6న ప్రజాభవన్ లో ఈ సమావేశం జరుగుతుంది.

గతంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కోసం రెండుసార్లు సీఎంలు భేటీ అయ్యారు. కృష్ణా, గోదావరి నీటి పంపకాలపై కేసీఆర్, చంద్రబాబునాయుడు ఒకసారి సమావేశం కాగా.. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న అన్ని సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. మరోసారి ఇరు రాష్ట్రాల సీఏస్ ల స్థాయిలో ఒక సమావేశం జరిగింది. అయినప్పటికీ సమస్యలకు ఎటువంటి పరిష్కారం లభించలేదు. ఎవరి నుంచి కూడా ఆచరణ యోగ్యమైన సూచనలు, సలహాలు రాలేదు. ఎటువైపు నుంచి కూడా అడుగులు ముందుకు పడలేదు.

రెండు రాష్ట్రాల మధ్య ఎక్కువగా విభజన చట్టం లోని 9, 10 షెడ్యూళ్లకు సంబంధించిన అంశాలే ఎక్కువ ఉన్నాయి. మొత్తంగా షెడ్యూల్ 9లో 91 సంస్థలు, షెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉన్నాయి. ఆ షెడ్యూళ్లలో ఉన్న ఆస్తుల నుంచి రెండు రాష్ట్రాలు కూడా ఎక్కువ వాటా కోరుతుండడంతో పరిష్కారం లభించడం లేదు. మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం తీవ్రతరం అవుతోంది. కృష్ణా నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మొత్తం 811 టీఏంసీల నీరు అలకేట్ చేయగా 299 టీఏంసీ లు తెలంగాణకు... 512 టీఏంసీ లు ఏపీకి కేటాయించారు. అయితే కృష్ణానది ప్రయాణించే దూరం, దాని పరీవాహక ప్రాంతం కూడా తెలంగాణకు ఎక్కువ ఉండడంతో కృష్ణాలో 50 శాతం వాటా కావాలంటోంది తెలంగాణ. దీని విషయంలో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

మరోవైపు ఏపీ విభజన సమయంలో ఉమ్మడి ఖమ్మంలోని 7 మండలాలను తెలంగాణ నుంచి ఏపీ కి బదలాయించారు. అయితే అందులో 5 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. వాటిని తమకు వెనక్కి ఇవ్వాలని తెలంగాణ కోరుతుంది. ఇది మాత్రమే గాక ఏపీ ప్రభుత్వం 6వేల కోట్ల విద్యుత్ బకాయిలు తమకు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. దానిపై ఏపీ రెస్పాండ్ కావడం లేదు. ఇలా పలు కీలకమైన అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరాల్సి ఉంది. మరి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఇప్పటికే ఒక మంచి అండర్ ‎స్టాండింగ్ ఉండడంతో.. అది రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి పనికొస్తుందా? వారి సమావేశం నుంచి ఎలాంటి ఫలితాలు ఆశించవచ్చు అనేది చూడాల్సి ఉంది. 

Tags:    

Similar News