తెలంగాణ ఆధ్యాత్మిక సిగలో మరో అద్భుతం ఆవిష్కృతం
Ramanujacharya statue: తెలంగాణ ఆధ్యాత్మిక సిగలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. అంటరానితనం, ఛాందసభావాలను రూపుమాపేందుకు కృషిచేసిన మహాసంస్కర్త మహా విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమైంది.
Ramanujana Statue: తెలంగాణ ఆధ్యాత్మిక సిగలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. అంటరానితనం, ఛాందసభావాలను రూపుమాపేందుకు కృషిచేసిన మహాసంస్కర్త మహా విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమైంది. భక్తి, శరణాగతి, సేవ వంటి సుగుణాలతో భగవంతుణ్ణి చేరుకోవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన రామానుజాచార్యులు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ ఆశ్రమంలో కొలువుదీరనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి.
రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ముచ్చింతల్ క్షేత్రంలో ఫిబ్రవరి 2 నుంచి 14వ వరకు జరగనున్నాయి. సమతా మూర్తి భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా.. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. త్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు, తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. పద్మపీఠంపై పద్మాసనంలో కూర్చున్న భంగిమలో ఉన్న 216 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. అలాగే, రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా బంగారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.
ఇక.. సమతామూర్తి మహా విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆలయ ప్రాంగణంలో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు చేశారు. మహా విగ్రహం చుట్టూ 8 పుణ్య క్షేత్రాలు, గర్భాలయాల ఆకృతిలో ఏకంగా 108 ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయాలను అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. మరోవైపు.. దివ్య క్షేత్రంలోకి అడుగుపెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఫౌంటెయిన్ భక్తులను ఆకట్టుకుంటుంది. దాదాపు 25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫౌంటెయిన్ పద్మ పత్రాలు విచ్చుకొనేలా రూపొందించారు. పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు, రామానుజులను అభిషేకిస్తున్న భావన భక్తులకు కలిగేలా తీర్చి దిద్దారు. అలాగే, రామానుజులు ప్రభోధించిన సమానత్వ ఘట్టాలను సూర్యాస్తమయం తరువాత మ్యూజిక్‌తో త్రీడీ షో ద్వారా ప్రదర్శించనున్నారు.
ఇక.. రాజస్థాన్‌లో మాత్రమే లభించే పింక్ గ్రానైట్‌తో తయారు చేసిన పలు ఆకృతులు క్షేత్రం ఆవరణలో కనువిందు చేస్తున్నాయి. సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు చేసిన 36 శంఖు, చక్రాలతో పాటు ఏనుగు ఆకృతులు అమర్చారు. రామానుజుల జీవిత విశేషాలు తెలిపే మ్యూజియంను కూడా నిర్మించారు. దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు, రెండు లక్షల మొక్కలు ఆధ్యాత్మిక శోభను మరింత పెంచేలా దర్శనమిస్తున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమయ్యే సహస్రాబ్ది ఉత్సవాల్లో దేశం నలుమూలల నుంచి 5వేల మంది రుత్వికులు పాల్గొననున్నారు. దీనికోసం 120 యాగశాలల్లో ఒక వెయ్యి 35 హోమగుండాలను సిద్ధం చేశారు.